
సాక్షి, విశాఖపట్నం: ‘వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి పోలింగ్ బూత్ స్థాయిలో గడపగడపకు వెళ్లబోతున్నాం. బూత్ కమిటీ సభ్యులతో కలిసి సమన్వయకర్తలు ప్రతి గడపకూ వెళ్లి.. ప్రతి ఒక్కర్ని స్వయంగా కలుసుకుని కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలియజేస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. స్థానిక బీచ్ రోడ్‌లోని విశాఖ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ రాష్ట్రస్థాయి సమన్వయకర్తల సమావేశం వివరాలను ధర్మాన మీడియాకు వివరించారు. పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారని చెప్పారు. రానున్న నాలుగైదు నెలలు చాలా కీలకమైనందున.. వాటికి సన్నద్ధమయ్యేలా కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పారు.
గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కర్నీ కలవాలి..
పాదయాత్ర జరిగే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీలు మినహా మిగిలిన 168 నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్..కావాలి జగన్’ అనే నినాదంతో ‘గడపగడపకు వైఎస్సార్‌సీపీ’ కార్యక్రమం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు దర్మాన తెలిపారు. ఈ నెల 17 నుంచి బూత్ కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆయా ప్రాంతాల్లోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో పాటు వైఎస్సార్‌సీపీ లక్ష్యాలను వివరించాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించినట్లు చెప్పారు. రానున్న నెల రోజుల్లో 50 పోలింగ్ బూత్‌ల పరిధిలో గల కుటుంబాల్లోని వ్యక్తులందర్నీ కలిసి మాట్లాడాలని ఆదేశించినట్లు వివరించారు.
నవరత్నాల వల్ల ఏఏ వర్గాలకు ఏడాదికి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తారని తెలిపారు. అలాగే ఎక్కడైనా ఇంకా బూత్ కమిటీల నియామకాలకు జరగకపోతే వాటిని రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు చెప్పారు. అలా నియమించనిపక్షంలో పార్టీ కేంద్ర కమిటీయే సమర్థులను గుర్తించి నియామకాలు చేపడుతుందని స్పష్టం చేశారన్నారు. బూత్ కమిటీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు మండల, జిల్లా, రీజనల్ స్థాయిల్లో ప్రత్యేకంగా బాధ్యులను నియమించుకోవాలని.. వారు గుర్తించిన విషయాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాలంటూ సమన్వయకర్తలను ఆదేశించారని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమమనే విషయాన్ని సమన్వయకర్తలు భావించాలని స్పష్టం చేసినట్లు వివరించారు. బూత్ కమిటీల పనితీరుపై సమన్వయకర్తలు సమీక్ష చేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉండండి..
రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగవనడానికి ఓటర్ జాబితాల తయారీలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలే నిదర్శనమని ధర్మాన పేర్కొన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని తమ పార్టీ అధినేత ఆదేశించారని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పేర్లనే అత్యధికంగా తొలగించారని.. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇలా తొలగించిన వారిని మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్పించుకునేందుకు వచ్చే నెల 30 వరకు ఎన్నికల కమిషన్ గడువిచ్చిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రజల్ని చైతన్యపర్చాలని పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ కమిటీలు కృషి చేయాలని.. పక్షపాత ధోరణితో పనిచేస్తున్న అధికారులపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేయాలని ఆదేశించారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని ధర్మాన వివరించారు. సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సీనియర్ నేత పొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే అంజాద్ భాషా, విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment