సంఘటన స్థలంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్: హిందూ సంప్రదాయం తెలిస్తే గ్రహణం రోజున కొన్ని కుటుంబాలను రోడ్డున నిలబెట్టేందుకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెగిస్తారా? అని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చిన ఇంటినే ఇప్పుడు కూల్చేయడానికి ఆమె అధికారులను పురమాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకు ళం నగరం శివారు చాపరం పంచాయతీ పరిధిలోని విశాఖ–బి కాలనీలో వైఎస్సార్‌సీపీ నాయకుడికి చెందిన భవంతిని కూల్చేయడానికి పంచాయతీ సిబ్బంది వెళ్లారు. అందులో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలంటూ హడావుడి చేశారు. గ్రహణం పూట వచ్చి ఇలా రోడ్డుపైకి వెళ్లమంటే ఎలాగంటూ ఆయా కుటుంబాల వారు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ధర్మాన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, తహసీల్దారు మురళీకృష్ణతో మాట్లాడారు.
ఇది ఎమ్మెల్యేకు తగునా?
శ్రీకాకుళం నగరంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ధర్మాన తప్పుపట్టారు. పట్టా తీసుకొని కొన్నేళ్ల క్రితం నిర్మించిన భవంతిని ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పక్షపాత చర్యలకు పాల్పడితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 1996లో తంగి ఈశ్వరరావుకు అప్పటి ఎమ్మెల్యే గుండ అప్పలసూర్యనారాయణ పట్టా ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన భార్య మాత్రం ఇప్పుడా విషయం తెలియకుండా కేవలం కక్ష సాధింపు కోసం భవనాలను కూల్చివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కళ్లెదుట బడ్జెట్ హోటల్ పక్కన భారీ కన్వెన్షన్ హాల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మిస్తున్న విషయం ఎమ్మెల్యేకు తెలియదా? అని ప్రశ్నించారు. దేవాదాయ భూముల్లోనే అక్రమాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తాము వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు కన్వెన్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చి వేయండని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment