
దిగ్విజయ్ సింగ్
భోపాల్: జమ్మూ కశ్మీర్ పౌరుల అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో కశ్మీర్ అంశాన్ని ఎలా చూడాలంటూ మీడియా మంగళవారం ఆయన్ను ప్రశ్నించింది. అందుకు ఆయన ‘కశ్మీర్ భారత్‌కే చెందాలి అనుకుంటున్నా.. పీవోకే కూడా భారత్‌దే. జమ్మూ కశ్మీర్‌లో సౌభ్రాతృత్వ భావన వేలాది ఏళ్లుగా ఉంది. ఇప్పుడు దేవుడిని ప్రార్థించడం ఒక్కటే మిగిలింది. కశ్మీరీలతో సోదరభావం కొనసాగాలని, అక్కడంతా శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేద్దాం’ అన్నారు.
జమ్మూ కశ్మీర్ విషయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విధానాలను నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. 1998-2004 మధ్య కాలంలో వాజపేయి ప్రధానిగా ఉండగా కశ్మీర్ సంస్కృతి, మానవత్వం, ప్రజాస్వామ్యం అనే మూడు అంశాల ప్రతిపాదికన కశ్మీర్ విధానం ఉండేదని గుర్తు చేశారు. దీనికి పూర్తి విరుద్ధంగా మోదీ సర్కారు వ్యవహరించిందని దుయ్యబట్టారు. కశ్మీర్‌పై పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కశ్మీర్ అంశాన్ని హిందూ-ముస్లిం కోణంలో చూడరాదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment