సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెంట రాజకీయ పార్టీలు లైన్ కడుతున్నాయి. తమ పార్టీకి సలహాదారుడిగా వ్యవహరించాలంటూ దేశంలోని ప్రముఖ నేతలంతా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రశాంత్ అపాయింట్‌మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి పీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత బిహార్‌లో నితీష్ కుమార్ కూటమి విజయం, పంజాబ్‌లో అమరిందర్ సింగ్ గెలుపుకోసం విశేషంగా కృషి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
దీంతో పశ్చిమ బెంగాల్‌లో తిరుగులేని శక్తిగా అవతరించిన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ప్రశాంత్‌కు ఆశ్రయించకతప్పలేదు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో తనకు వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ దీదీ కోరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురులేదనుకున్న మమత బీజేపీ ధాటికి దారుణంగా దెబ్బతిన్నారు. మెజార్టీ సిట్టింగ్ స్థానాలకు కోల్పోవల్సి వచ్చింది. దీంతో పీకే అవసరం తప్పదని భావించిన మమత.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అతనితో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు.
ఇదిలావుండగా తాజాగా ప్రశాంత్ కిషోర్‌కు మరో ప్రాజెక్టు కూడా వచ్చినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో బలమైన నేతగా గుర్తింపుపొందిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా ప్రశాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలు గురించి పీకేతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే స్టాలిన్, కిషోర్ మధ్య సమావేశం జరుగనుందని చెన్నై వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment