సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవకాశం దొరికినప్పుడల్లా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం రేపటి ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? ప్రజలు నిజంగా రాష్ట్ర హోదా కోరుకుంటున్నారా? విస్తృత అధికారాల కోసం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర హోదాను కోరుకుంటుండవచ్చు! అయితే అది సిద్ధిస్తుందని ఆయన ఆశిస్తున్నారా? అసలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలనే డిమాండ్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది?
మార్చి 24వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 1991లో చేసిన 69వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీకి ప్రజా ఎన్నికల ద్వారా అసెంబ్లీ, ముఖ్యమంత్రి నాయకత్వంలో ఓ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. అయితే ముఖ్యమంత్రికి పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు మాత్రమే ఈ రాజ్యాంగం ద్వారా సిద్ధించాయి. పోలీసు వ్యవస్థ, భూములు, కొన్ని పౌర అధికారాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి.
‘ప్రతి దానికి మనం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలకు ఆ ఖర్మ లేదు. మాకు మాత్రం ఎందుకు ఉండాలి అని అడిగాం! ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదని వారు చెప్పారు. మరి ఢిల్లీకి సగం రాష్ట్ర హోదా ఎందుకు ఇచ్చారు ? ఢిల్లీ వాసులు పన్నులు చెల్లించడం లేదా?’ అని 24 నాటి సమావేశంలో కేజ్రివాల్ ఘాటుగా మాట్లాడారు. ఆ సమావేశానికి హాజరైన పలువురు సభికులను రాష్ట్ర హోదా గురించి ఏమనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా ‘నేనయితే రాష్ట్ర హోదా గురించి మొదటిసారి వింటున్నాను. రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఒక్క ఉద్యోగం రాలేదు. రాష్ట్ర హోదా వస్తే మాత్రం వస్తుందనే నమ్మకం లేదు’ అని ఒకరు, ‘15 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఒక్కసారి రాష్ట్రహోదా గురించి మాట్లాడితే విన్నాం. ఇప్పుడు కేజ్రివాల్ మాట్లాతుంటే వింటున్నాం. దీని వల్ల ఏం ఒరుగుతుందో, ఏమో తెలియదుగానీ హోదా వస్తుందన్న నమ్మకం మాత్రం లేదు’ మరొకరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైన ఈ ఎన్నికలపై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపించదని మాత్రం మెజారిటీ ఓటర్లు స్పష్టం చేశారు.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలంటూ 1998లో బీజేపీ, ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఈ డిమాండ్‌ను ఆ రెండు పార్టీలు వదిలేశాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నా కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వకపోవడం విచిత్రం.
Comments
Please login to add a commentAdd a comment