పవన్, లోకేష్‌ శవ రాజకీయాలు మానండి  | Dwarampudi Chandrasekhar Reddy Fires On Pawan Kalyan And Lokesh Babu | Sakshi
Sakshi News home page

పవన్, లోకేష్‌ శవ రాజకీయాలు మానండి 

Published Wed, Nov 6 2019 8:55 AM | Last Updated on Wed, Nov 6 2019 8:55 AM

Dwarampudi Chandrasekhar Reddy Fires On Pawan Kalyan And Lokesh Babu - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి  

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, చంద్రబాబు తనయుడు లోకేష్‌ శవ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజలు ఛీ కొట్టినా వీరి ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. ప్రతీ అంశాన్నీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పవన్, లోకేష్‌ ఉన్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి తమ నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.  కాకినాడలో మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి వీరబాబు అనే వ్యక్తి మృతి చెందితే ఆ అంశాన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడుకునేందుకు లోకేష్‌ ప్రయతి్నంచారంటూ ధ్వజమెత్తారు.

ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగిన వెంటనే టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఇసుక కొరత కారణంగా పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. పార్టీ తరఫున కొంత సొమ్ము ఇస్తామంటూ చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ వెంటనే రాత్రికి రాత్రే బయలుదేరి ఉదయాన్నే కాకినాడ చేరుకుని చేసిన హడావుడి చూస్తుంటే టీడీపీ నేతలు ఎంతగా దిగజారారో అర్థం అవుతుందన్నారు. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి కలిగే బాధ వర్ణనాతీతమని, చేతనైతే వారికి సహాయం చేసి ఆదుకోవాలే తప్ప శవరాజకీయాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిం చారు. పెదపూడి మండలం చింతపల్లి లాకులకు చెందిన మృతుడు వీరబాబు కొంతకాలంగా పనులకు వెళ్లడం లేదని, అతని భార్య రోజువారీ వేతనంపై ఓ ఆయిల్‌ కంపెనీలో పనిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఆమె కూడా ఆరోగ్యం బాగోలేక కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదన్నారు. వాస్తవాలను వక్రీకరించి భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ద్వారంపూడి ప్రశ్నించారు. ఓ వైపు ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కొద్దిరోజులకే వర్షాలు, వరదలతో ఇసుక కొరత ఏర్పడడం వాస్తవమేనన్నారు. అయితే సమస్యకు ముఖ్యమంత్రి జగన్‌ శాశ్వత పరిష్కారాన్ని చూశారని, పది, పదిహేను రోజుల తరువాత ఇసుక కొరత కనిపించదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక పేరుతో ఎంత దోపిడీ చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు.
 
ఐదేళ్లూ ఏమయ్యావు పవన్‌? 
ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేసే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు పాలనలో ఎందుకు అడ్రస్‌ లేకుండా పోయారని ఎమ్మెల్యే ద్వారంపూడి నిలదీశారు. 2014లో చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని టీడీపీ విజయానికి సహకరించిన పవన్‌... చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయినప్పటికీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మంత్రులు బొత్స, కన్నబాబులను విమర్శిస్తున్న పవన్‌ కల్యాణ్‌ తీరుపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు.  రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో పవన్‌కు సమాధానం చెబుతామన్నారు.

ఆయనకు ఉన్నన్ని లొసుగులు వేరెవ్వరికి లేవని, సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్‌కల్యాణ్‌ చరిత్రను బాహాటంగానే చెబుతారన్నారు. అన్న చిరంజీవి లేకపోతే నీ అడ్రస్‌ ఎక్కడ? అని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌మాట తీరు, వ్యవహారశైలి, ప్రవర్తన రాజకీయాలకు పనికి రావన్నారు. తాము ప్రజల్లో నుంచి ఎదిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, ఆయనలా రెండు చోట్ల పోటీ చేసి ఘోరపరాజయాన్ని చవి చూడలేదన్నారు. రాజకీయాల్లో హుందాగా, సంస్కారవంతంగా వ్యవహరించాలని తమ నాయకుడు జగన్‌ సూచించినందున తాము వ్యక్తిగత విమర్శలకు వెళ్లడం లేదన్నారు.  

జనసేనలో అస్పష్టత 
విశాఖలో చేసిన మార్చ్‌పాస్ట్‌లో పవన్‌కల్యాణ్‌ ఇసుక కొరత కారణంగా  30 మంది చనిపోయారని చెప్పారని, ఆ తరువాత ఆ పార్టీకే చెందిన మరో నేత నాదెండ్ల మనోహర్‌ ఐదుగురు మృతి చెందారని చెప్పారన్నారు. దీన్ని బట్టి  చూస్తే ఆ పార్టీలో అస్పష్టత నెలకొందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆర్‌. చంద్రకళాదీప్తి, కాకినాడ పార్లమెంట్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు అల్లి రాజబాబు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement