సాక్షి, కాకినాడ : జనసేన పార్టీ కార్యకర్తలు కావాలనే ఒక ప్లాన్ ప్రకారం తన ఇంటిపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తన ఇంటికి ధ్వంసం చేసేందుకు యత్నించారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే.. రాజధాని సాకుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నింస్తున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు నానాజీ రెచ్చగొట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు తన నివాసంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారని తెలిపారు.
పవన్‌కు నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. నేతలను తప్పుదారి పట్టించే మనస్తత్వం నానాజీది అని.. అ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ఈ దాడిపై పవన్ స్పందించిన తీరు సరికాదన్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ భాష మార్చుకోవాలని.. వారి భాష బాగుంటే తామంతా బాగుంటామని ద్వారంపుడి పేర్కొన్నారు.
(చదవండి: కాకినాడలో టెన్షన్.. టెన్షన్)
కాగా, ఆదివారం ఉదయం కాకినాడ నగరంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో స్థానికేతరులు కాకినాడ వచ్చి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై దాడికి ప్రయత్నించారు. వేర్వేరు వీధుల నుంచి గుంపులుగా చుట్టుముట్టి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ పరిణామాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment