
న్యూఢిల్లీ : గుడ్లు తినేవారు రాక్షసులంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీ ఆహారంలో గుడ్లను చేరుస్తూ.. కమల్‌నాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భార్గవ్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మాంసాహారం తీసుకోవడం నిషేదమన్నారు. తన కుల నియమాలలో భాగంగా వెల్లుల్లి, ఉల్లిపాయలను సైతం తాను తీసుకోనని అన్నారు.
మరోవైపు మహిళ శిశు సంక్షేమ మంత్రి ఇమ్రితా దేవి ఆలోచన మేరకు మెరుగైన పోషకాహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు గుడ్లను ఆహారంలో చేర్చింది. అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్గవ.. గుడ్లు, మాంసం తినే విధంగా ప్రభుత్వం పిల్లలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆహారంలో గుడ్లను చేర్చడాన్ని మరో బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గియా తప్పుబట్టారు. ఈ నిర్ణయం మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన విమర్శించారు.
అయితే బీజేపీ నాయకుల ఆరోపణలపై ఇమ్రితా దేవి ఘాటుగా స్పందించారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని ఆమె అన్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు మెరుగైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివని.. తాను కూడా రోజు ఆహారంలో గుడ్లు తీసుకుంటానని ఇమ్రితా చెప్పారు. మరోవైపు పోషకాహార లోపంతో బాధపడే దేశాలలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దిగువున భారత్ ఉండడం విచారించే అంశమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.