సాక్షి, అనంతపురం : సార్వత్రిక సమరంలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ తంతు పూర్తి కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే విషయం తెలిపోయింది. ఇక అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించనున్నారు. 12 రోజులు మాత్రమే గడువుండటంతో వేగం పెంచారు. పార్టీల అధినేతలు తరచూ జిల్లాకు వస్తుండటంతో రాజకీయం వేడెక్కింది. వీరికి తోడు సినీగ్లామర్ కూడా జోడించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రచార హడావుడిలోనే ఎన్నికల్లో డబ్బు పంపిణీ కూడా పూర్తి చేసేందుకు అభ్యర్థులు ప్రణాళికలు రచించుకున్నారు. దీంతో జిల్లాలో ఏ పల్లె, వీధి చూసినా ఎన్నికల కోలాహలమే కన్పిస్తోంది.
జిల్లాలో 2 పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 187మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 222 మంది నామినేషన్లు దాఖలు చేయగా 35మంది ఉపసంహరించుకున్నారు. అత్పలంగా మడకశిర నుంచి 7గురు అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. అత్యధికంగా కళ్యాణదుర్గం, ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ బరిలో 15మంది చొప్పున నిలిచారు. ఒక్కో ఈవీఎంలో అత్యధికంగా 16మంది అభ్యర్థులకు ఓటెయ్యవచ్చు. ఈ లెక్కన అన్ని పోలింగ్ బూతుల్లో అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఒక్కో ఈవీఎం చొప్పున మాత్రమే ఉండనున్నాయి.
ఓటుకు రూ.2వేలు
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు చూస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో రూ.2వేలు, తక్కిన వాటిలో రూ.వెయ్యి పంచాలని టీడీపీ నేతలు భావించినా ఇప్పుడు ఓటమి తప్పదని తెలుస్తున్న తరుణంలో అన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.2వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.వెయ్యి ఇచ్చి ఉంటే.. మరో విడత కూడా పంచాలని చంద్రబాబు బుధవారం రాత్రి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
ఎదురుగాలి వీస్తోందనే ఆందోళనలో చంద్రబాబు:
బుధవారం రాత్రి అనంతపురంలో బస చేసిన చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. గురువారం కూడా మరో విడత చర్చలు జరిపినట్లు సమాచారం. కడపలో ఫరూక్‌అబ్దుల్లాను తెచ్చినా జనం రాలేదని, అనంతపురంలో మరీ అధ్వానంగా వచ్చారని, జగన్ సభలతో పోలిస్తే టీడీపీ సభలకు జనస్పందన తీసికట్టుగా ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తే పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనే సంకేతం వెళ్తోందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు వెదజల్లడం మినహా మరో ఆయుధం మనవద్ద లేదని చెప్పినట్లు సమాచారం. తనకు ‘అనంత’లో 3 మినహా 11 స్థానాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే సమాచారం ఉందని.. లేదు 10 గెలుస్తున్నామని జిల్లా నేతలు చెప్పారని, కానీ తన సర్వేనే నిజం అయ్యేలా ఉందనే అభిప్రాయన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల ప్రచారం
నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇక ప్రచారంపై అంతా దృష్టి సారించారు. సమయం తక్కువగా ఉండటంతో అన్ని ప్రాంతాలను చుట్టొచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు కూడా ప్రచారబాధ్యతలు తీసుకున్నారు. అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి పిల్లలు, సోదరుని పిల్లలు.. చివరకు అమెరికాలో ఉన్న ఆయన సోదరుడు సుబ్బారెడ్డి కుమారై కూడా ప్రచారంలో పాల్పంచుకుంటున్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితో పాటు వారి సోదరుడు చందు, రాజశేఖర్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన సతీమణి, కుమారుడు ప్రణయ్ కూడా ప్రచారం చేస్తున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి సతీమణి కూడా ప్రచారం సాగిస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర కూడా ప్రచారం చేపడుతున్నారు. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులు వారి కుటుంసభ్యులను రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment