సాక్షి, విజయవాడ : పోలవరంపై విచారణ జరిపిస్తే సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా జైలుకు వెళ్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై విలేకరులతో మాట్లాడారు. పోలవరం కడితే 800 టీఎంసీలు వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమన్నారు. శ్రీ రాంసాగర్ తరువాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 లోనే పోలవరం టెండర్లు పిలిచి, ఒక్కో అనుమతిని ఆయనే సాధించారని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాలకు ఇచ్చే పునరావాసం ఖర్చుకు ఆనాడే ముందు చూపుతో వైఎస్ఆర్ లెక్కగట్టి ప్రాజెక్ట్ ఖర్చులో చూపించారని తెలిపారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలకు కూడా వైఎస్ఆర్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష ఆరోపణలను కేంద్రం ప్రశ్నిస్తోంది..
2014లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టిన పోలవరంను రాష్ట్రం ఎందుకు కడతామని పట్టుబట్టిందని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెబితే బాబు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖల్లో అమర్‌జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్ లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టారని ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారని ఉండవల్లి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ నోటిఫికేషన్ లో 1300 కోట్లని, వెబ్‌సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని, కేవలం కాంట్రాక్టుల కోసమే అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం కూడా అడుగుతోందన్నారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా అని ప్రశ్నించారు.
పోలవరంతో ఏపీ సస్యశ్యామలం..
1600 కోట్లు పట్టిసీమ కోసం, 1800 కోట్లు పురుషోత్తం పట్నంకు కేటాయించారన్న ఉండవల్లి.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి రాసిన లేఖలో పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారని, ఈ ప్రాజెక్టులు సరిపోతాయి తప్ప, పోలవరం అక్కరలేదని లేఖలో ప్రస్తావించారని తెలిపారు. 17,500 క్యూసెక్కుల నీటి సామర్థ్యం తో ఆనాడు పోలవరం కాలువలను వైఎస్ఆర్ తవ్వించారని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు.
పనులు చేయకపోతే తప్పించండి..
ట్రాన్స్ట్రాయ్ కంపెనీ పనిచేయడం లేదని తెలిస్తే, సదరు కంపెనీతో మాట్లాడి తప్పించాలన్నారు. ఆనాడు వైఎస్ఆర్ పోలవరం పనులు చేయడం లేదని టిడిపి నేత నామా నాగేశ్వరరావు కంపెనీని పిలిచి, పనుల నుంచి తప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఇకనైనా పోలవరంపై నిజాలను ప్రజలతో పంచుకోవాలని హితవు పలికారు. సాక్షాత్తు బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్ళు తెరవడం లేదన్నారు. ఇప్పటికైన పోలవరంపై చంద్రబాబు శ్వేత పత్రం ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. 2.16లక్షల కోట్లు ఈ మూడేళ్ళలో రాష్ట్రం చేసిన అప్పులని. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయో.. లెక్కలు చెప్పాలన్నారు.
యూపీఏ ప్రభుత్వం ముందు చూపు..
యూపీఏ ప్రభుత్వం తన ఆఖరి కేబినెట్ సమావేశంలో పోలవరం నిర్మాణంకు ఎంత ఖర్చుఅయితే అంతా కేంద్రమే భరించాలని తీర్మానించి చట్టం చేసిందన్నారు. దీనిని గమనించకుండా చంద్రబాబు నీతి అయోగ్ ద్వారా రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపట్టేందుకు అంగీకారం తెలిపాడన్నారు. ఏడు ముంపు మండలాలను 2014 మార్చి 1న ఏపీలో విలీనం చేస్తూ యూపీఏ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కు రాష్ట్రపతికి పంపారని, అసెంబ్లీ అభిప్రాయం లేదని అధికారులు దానిని పక్కన పెట్టారని ఉండవల్లి గుర్తు చేశారు. మే 28న జైరాం రమేష్ చొరవ తీసుకుని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చెప్పి ముంపు మండలాలపై ఎన్డీఎ ప్రభుత్వం ద్వారా ఆర్డినెన్స్ తెప్పించారన్నారు. ఇది తన ఘనతే అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కాపు రిజర్వేషన్లపై స్పందిస్తూ.. మంజునాథ్ నివేదిక లేకుండా కమిషన్ రిపోర్ట్కు చట్ట బద్దత ఏమేరకు ఉంటుందని ప్రశ్నించారు. చట్టాలపై గౌరవం లేకుండా బాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment