
సాక్షి, అనంతపురం: ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలాగే, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా పొందాలంటే 10 శాతం సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.
చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది.
వైఎస్సార్ కృషి వల్లే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు. 45 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. హంద్రీనీవా కాలువల వెడల్పు చేసిన తర్వాతే.. లైనింగ్ పనులు చేపట్టాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి.. నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ద్రోహం చేయడమే అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment