సాక్షి, తాడేపల్లి: పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో కేంద్రం నిర్ణయానికి చంద్రబాబు ఎందుకు తలవంచారో తెలియాలన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోందని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి కారుమూరి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదు. పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. పోలవరం అంగుళం ఎత్తు తగ్గినా ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కేంద్రానికి చంద్రబాబు ఎందుకు తలొంచారో తెలియాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండేది. చంద్రబాబు ప్రీమియం చెల్లించకుండా రైతులను నష్టపరిచారు.
ఏపీలో ఈక్రాప్‌తో సహా ఏదీ ఈ ప్రభుత్వం చేయటంలేదు. దోచుకో, దాచుకో, పంచుకో అనే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతోంది. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం కొనుగోలులోనూ రైతులపై రకరకాల వేధింపులకు దిగారు. రైతుల ఉసురు తీయవద్దు. సూపర్ సిక్స్‌లో రైతులకు 20వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. రైతులకు చేయాల్సినవి అన్నీ చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment