
కంచిలి/కవిటి: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ప్రజా సంకల్ప యాత్రలో హైలెట్‌గా మారింది. పాదయాత్రకు వచ్చిన ప్రజలు ఈ పుస్తకాలను ఎవరికివారుగా వచ్చి తీసుకుని.. ఆద్యంతం ఆసక్తిగా చదవడం కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలు.. నిర్వాహకుల నుంచి ఈ పుస్తకాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కేవలం రెండు గంటల్లోనే వేలాది కాపీలను దక్కించుకున్నారు. ఈ పుస్తకంలో వివరించిన అవినీతి బాగోతాలపై ఫేస్‌బుక్‌లు, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడంతో క్షణాల్లోనే అవి ప్రపంచం నలుమూలలకు చేరాయి. పుస్తకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిలో ప్రచురించిన 143 అంశాలను ఆసక్తి చదవడం కనిపించింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతి, లక్షల కోట్ల దోపిడీ, అమరావతి ఒక అంతర్జాతీయ కుంభకోణం, తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వైనం.. తదితర అంశాలను ఈ పుస్తకం సాక్ష్యాధారాలతో సహా వివరించిందని పలువురు పేర్కొన్నారు. సరైన సమయంలో పుస్తకాన్ని విడుదల చేశారని పలువురు కితాబిచ్చారు.
దోపిడీ, అవినీతి పాలనను కళ్లకుకట్టింది
నాలుగున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, దోపిడీ పాలనను ఈ పుస్తకం కళ్లకుకట్టింది. ఏ ఏ రంగంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో.. శాఖాపరమైన జీవోలను ఉటంకిస్తూ ఆధారాలతో సహా తెలియజేసింది. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఈ పాలనపై అసహ్యం వేస్తోంది.
– బట్టి మాధవరావు, మత్స్యకార ఐక్యవేదిక నాయకుడు, శ్రీకాకుళం
ఆధారాలతో వివరించిన తీరు అద్భుతం
వరి ఉత్పత్తిలో అత్యంత కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పచ్చని పంటపొలాలను రైతుల నుంచి లాక్కున్న తీరు దారుణం. నిబంధనలు తోసి రాజని భూదందా నిర్వహించిన విధానం చాలామంది ప్రజలకు పూర్తిగా తెలియని విషయం. ఆయా అంశాలను ‘అవినీతి చక్రవర్తి’లో ఆధారాలతో సహా వివరించిన తీరు అద్భుతం.
– మర్రెడి సాంబిరెడ్డి, నిడమర్రు, గుంటూరు జిల్లా.
తవ్వేకొద్ది అవినీతి.. చంద్రబాబుది
చంద్రబాబు చేసిన అవినీతి తవ్వేకొద్ది మరింత బయటపడుతోంది. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని అట్టడుగు వర్గాలకు సైతం ఈ పుస్తకం ద్వారా తెలియజేసే అవకాశం దక్కినట్టయింది.
– శెట్టి రవీంద్రబాబు, అరకు, విశాఖపట్నం జిల్లా