సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. వాటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారాయి.
వీటికి సంబంధించిన పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్‌పత్రాల ముద్రణ, నిర్వహణ సిబ్బంది, ఇతరత్రా అన్ని అంశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ విధించడంతో పాటు, తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మరింత పెంచారు. మూడు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనుండగా.. సోమవారం (6న) మొదటి దశ, 10న రెండో విడత, 14న మూడోవిడత ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత 5 జిల్లాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
ఎంపీటీసీకి సగటున ముగ్గురు పోటీ
తొలివిడతలో 195 మండలాల్లో 2,157 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 7,702 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిలో అత్యధికంగా టీఆర్‌ఎస్ నుంచి 2,094, కాంగ్రెస్ నుంచి 1,867, బీజేపీ తరఫున 1,057, సీపీఎం అభ్యర్థులుగా 138, టీడీపీ నుంచి 107, సీపీఐ తరఫున 82, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లుగా 1,666 మంది అభ్యర్థులున్నారు. మొత్తంగా చూస్తే సగటున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ముగ్గురేసి మంది.. ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, మేడ్చల్, ములుగు జిల్లాల్లో నలుగురు చొప్పున పోటీపడుతున్నారు.
195 జెడ్పీటీసీ స్థానాల్లో 882 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా ఇందులోనూ.. టీఆర్‌ఎస్ నుంచి 195, కాంగ్రెస్ తరఫున 190, బీజేపీ అభ్యర్థులుగా 171 మంది పోటీ చేస్తుండగా.. సీపీఎం (22 మంది), టీడీపీ (63), సీపీఐ (14), ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు (34), ఇండిపెండెంట్లు (193 మంది) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి నలుగురేసి పోటీచేస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, మహ బూబాబాద్, వరంగల్ (రూరల్) జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జోగుళాంబ, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ (అర్బన్) జిల్లాల్లో అయిదుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు.
‘మూడు’లో మిగిలింది 11,677 అభ్యర్థులే!
రెండో విడతలో పరిషత్ ఎన్నికలు జరిగే ప్రాదేశిక నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఈ నెల 10న రెండో విడత పోలింగ్ జరగనుండగా 8న ప్రచారం ముగియనుంది. మూడో విడత నామినేషన్లకు శనివారం పరిశీలన ముగిసింది. దీంతో 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 11,677 నామినేషన్లు అర్హత సాధించాయి. వీటిలోనూ ఉపసంహరించుకునే వారికి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఇచ్చారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో..
నక్సల్ ప్రభావిత 5 జిల్లాల్లో పరిషత్ పోలింగ్ సమయం గంట కుదించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, జయశంకర్, ములుగు జిల్లాల పరిధిలోని 75 జెడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాల్లో ఈ గంట కుదింపు పాటిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతియుతంగా పోలింగ్, ఓటింగ్ ముగిశాక సుదూర ప్రాంతాల నుంచి బ్యాలెట్‌బాక్సులు, సిబ్బంది సకాలంలో మండల, జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు సమయాన్ని కుదించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు డీజీపీ లేఖ రాశారు.
ఈ మేరకు సమయాల్లో మార్పులు తీసుకుంటూ ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది. మొదటివిడతలో భాగంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు 217 ఎంపీటీసీ స్థానాల్లో (ఐదు జిల్లాలు) ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రచారపర్వం ముగియడంతో.. స్థానికేతరులైన నేతలు మండల కేంద్రాల్లో ఉండరాదని పోలీసులు, ఎన్నికల అధికారులు ఆదేశించారు.
ఈ స్థానాల్లో 7 నుంచి 4 వరకే!
తొలివిడతలో ఎన్నికలు జరిగే స్థానాల్లో.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరులో 8, చింతలమానేపల్లిలో 8, దహేగాంలో 8, కౌటాలలో 9, పెంచికలపేట్‌లో 4, సిర్పూర్ (టీ) పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాల్లో.. బెల్లంపల్లి జిల్లాలో బెల్లంపల్లిలో 8, భీమినిలో 4, కన్నేపల్లిలో 5, కాసిపేటలో 9, నెన్నెలలో 7, తాండూరులో 9, వేమనపల్లిలో 5 ఎంపీటీసీ స్థానాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వా పురంలో 12, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, ముల్కలపల్లిలో 10, పాల్వంచలో 10, టేకులపల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లిలో 11, ములుగు ఘణపురంలో 10, రేగొండలో 17 స్థానాల్లో, ములుగు జిల్లాలో వాజేడులో 7, వెంకటాపురంలో 9, ఏటూరునాగారంలో 9, కన్నాయిగూడెంలో 4, సమ్మక్క–సారక్క తాడ్వాయిలో 7 స్థానాల్లో ఉదయం 7 నుంచి 4 వరకే పోలింగ్ జరగనుంది. రెండో విడతలోనూ ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment