సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి గడ్డం వినోద్ తిరిగి సొంతగూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా జి.వినోద్ పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వినోద్ మాట్లాడుతూ..‘గతంలో కాంగ్రెస్ పార్టీని వీడడం అపరిపక్వ నిర్ణయం. తిరిగి సొంతగూటికి చేరడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్ఠంగా భావిస్తున్నాను. గతంలో కొన్ని పొరపాట్ల వలన పార్టీ మారాల్సి వచ్చింది. 35 ఏళ్ల నుంచి నాకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి ప్రోత్సహంతో రాజకీయాల్లోకి వచ్చాను. కొన్ని కారణాల వలన ఇండిపెండెట్‌గా పోటీ చేశాను. నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. వివేక్ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అందుకే నేను కాంగ్రెస్ లో చేరాను’ అని పేర్కొన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ నుంచి వినోద్, వివేక్ బ్రదర్స్ తొలుత 2013 జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2014 మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీచేసి ఓడిపోయారు. అనంతరం రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్‌ఎస్ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోదరులిద్దరికీ టిక్కెట్లు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ మొండిచేయి చూపించింది. దీంతో వినోద్ ఒంటరిగా చెన్నూరు నుంచి పోటీ చేయగా.. వివేక్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment