
సాక్షి, హైదరాబాద్: 2014 ఎన్నికల మేని ఫెస్టో హామీలను నెరవేర్చకుండా కొత్త మేనిఫె స్టోను ఏవిధంగా విడుదల చేస్తారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న హామీ తో పాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులను నమ్మించి మోసం చేయడంతో పాటు అవమానించారన్నారు.
సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో పేదలకు 9 నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే టీఆ ర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రెండింటికి పరిమితం చేసిందన్నారు. మహాకూటమిని చూసి కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చక టీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారని.. ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.