జమ్మికుంటలో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ హెచ్చరించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటనను సాకుగా చూపి ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించాలనే నిర్ణయం అనాగరికమన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మూర్ఖత్వమని విమర్శించారు.
ప్రతిపక్షాలను చులకన చేయడం, ధర్నాచౌక్‌లు ఎత్తివేయడం నియంత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండా అంటూనే రక్తపుటేరులు పారిస్తున్నారని.. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. చెర్ల పద్మ, దిండిగాల మధు, బాశెట్టి కిషన్, మాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, సాయికృష్ణ, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు.
నిరంకుశ చర్య: మాజీ ఎంపీ పొన్నం
బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యకు నిదర్శనమని టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హెడ్‌ఫోన్ విసిరిన సంఘటనను సాకుగా చూపి ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయడం, 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పెప్పర్‌స్ప్రే దాడి జరిగినా..స్పీకర్ సమావేశాన్ని కొనసాగించిన తీరును గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ నేతలు రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామని పొన్నం హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం : గజ్జెల కాంతం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్జెల కాంతం అన్నారు. నియంతల వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుయాత్రలో కాంగ్రెస్‌కువచ్చిన ప్రజాస్పందనను చూసీ కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి, నాయకులు బాశెట్టి కిషన్, చొప్పదండి మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి జనార్దన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎం.తిరుపతిరావు, సముద్రాల అజయ్ పాల్గొన్నారు.
జమ్మికుంటలో.. బడ్జెట్ సమావేశాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంటలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆబాది రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎస్సైలు శ్రీనివాస్, రియాజ్ అక్కడికి చేరుకోగానే.. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరిగింది. పర్లపల్లి రమేశ్, దిడ్డి రామ్, సాయిని రవి, ఎండి సలీం, తిరుపతి, భాస్కర్, ఎగ్గని శ్రీనివాస్, బోగం వెంకటేశ్, గౌస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment