'కారు' చిచ్చు! | Group fights in Mahabubnagar TRS | Sakshi
Sakshi News home page

'కారు' చిచ్చు!

Published Sun, Oct 8 2017 2:27 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Group fights in Mahabubnagar TRS - Sakshi

సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అధికార టీఆర్‌ఎస్‌లో విభేదాలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా రాజుకున్న చిచ్చు వేదికలపై ఒక్కొక్కటిగా బయటపడి తారాస్థాయికి చేరుకుంటోంది. శుక్రవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన  వివాదం రచ్చకెక్కగా.. తాజాగా శనివారం నారాయణపేటలోనూ భగ్గుమన్నాయి. ‘పేట’ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో 2014లో టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీపడి ఓటమిపాలైన కుంభం శివకుమార్‌రెడ్డికి మధ్య కొన్నిరోజులుగా వార్‌ జరుగుతోంది. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ శివకుమార్‌ వర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పార్టీ మండల కార్యదర్శి గౌని శ్రీనివాస్‌ శనివారం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవరెక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సముదాయించి కిందకు దించారు. అనంతరం దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి వద్ద శంకుస్థాపన చేసిన సబ్‌స్టేషన్‌ కార్యక్రమంలో తనను పార్టీలో అవమానిస్తున్నారంటూ మంత్రి సమక్షంలోనే శివకుమార్‌ మిగతా బహిరంగంగా విమర్శించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఇరువర్గాల వారిని మంత్రి సర్దిచెప్పి శాంతపరిచారు.  

పెరిగిన గ్రూపు తగాదాలు
గులాబీ గూటిలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. నాయకులు తమ ఆవేదనలను వేదికలపై వెళ్లగక్కుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య పలుమార్లు విభేదాలు పొడచూపాయి. ఒకానొక సందర్భంలో  విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం కార్యక్రమం విషయంలోనూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయంలో ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి మంత్రి జూపల్లి తీరుపై విమర్శలు చేశారు. తాజాగా శుక్రవారం జెడ్పీ అథితిగృహం ప్రారంభోత్సవం విషయంలోనూ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య మాటలయుద్ధం నడిచింది. ఇలా బడా నాయకుల మధ్య వార్‌ కొనసాగుతుండగా మరోవైపు నియోజకవర్గాల్లో కూడా క్యాడర్‌ మధ్య గ్రూపు విభేదాలు పొడచూపుతున్నాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. అప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులకు గ్రామ, మండల స్థాయినుంచి విభేదాలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు.  

‘పేట’లో లొల్లి..
నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి, ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డిల మధ్య పచ్చిగడ్డివేస్తే మండేట్లుగా తయారైంది పరిస్థితి. 2014 సాధారణ ఎన్నికల్లో ‘పేట’ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున శివకుమార్‌ పోటీచేయగా.. రాజేందర్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో ఓడిపోయినప్పటికీ శివకుమార్‌ తన హవా కొనసాగించారు. అయితే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య అంతర్గత గొడవలు జరుగుతున్నాయి.  


శివకుమార్‌పై నజర్‌..
టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాటినుంచి ప్రత్యర్థి శివకుమార్‌ వర్గంపై ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి  నజర్‌ పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడా శివకుమార్‌ పేరెత్తకుండా  ఆఖరికి ఫ్లెక్సీల్లో  ఏర్పాటు చేసే ఫొటో విషయంలోనూ జాగ్రత్త పడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా ఎమ్మెల్యే అనుచరుల చేతిలోనే ఉండిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో విభేదాలు బయటపడ్డాయి. నారాయణపేట నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వచ్చిన సమయంలో వేదికపై ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నేతలను ఎమ్మెల్యే సన్మానిస్తూ ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం శివకుమార్‌రెడ్డి ఉన్నా ఆయన పేరును ప్రస్తావించకపోవడం, .సన్మానించకపోవడంతో అందరు అవాక్కయ్యారు. ఈ మధ్యే కంసాన్‌పల్లి నుంచి ధన్వాడ బీటీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు ధన్వాడకు వచ్చిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎదుట బయటపడ్డ గొడవ మరకముందే అదే మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గౌని శ్రీను ఏకంగా ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడంటూ శనివారం సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా చేశాడు. దీన్ని బట్టి ‘పేట’ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న వర్గపోరు బయటపడింది.  


బతుకమ్మలపై ప్రమాణం
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి సైతం శివకుమార్‌ వర్గం చికాకు పెట్టిస్తోంది. గత నెలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే సొంత మండలం కోయిల్‌కొండలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రాంపూర్‌కు శివకుమార్‌రెడ్డిని ఆహ్వానించి భారీ ఎత్తున ర్యాలీని చేపట్టారు. ఈ సంబరాల్లో కొంత మంది టీఆర్‌ఎస్‌ వర్గీయులు ‘ఇంత వరకు ఎమ్మెల్యేకు మద్దతునిచ్చి తప్పుచేశాం.. శివన్న ఏ పార్టీ నుంచి టికెట్‌ తెచ్చుకున్నా..  స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసినా.. మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.. బతుకమ్మలపై ప్రమాణం చేస్తున్నాం’ అంటూ శపథం చేశారు. అదేవిధంగా దామరగిద్ద మండలంలోని మొగల్‌మడ్కా పంచాయితీ పరిధిలో గల సుద్దబండాతండాలో రెండు రోజుల క్రితం  భవానీ మందిర్‌ ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేతో పాటు శివకుమార్‌రెడ్డిని ఆ గ్రామ పాలకులు, నిర్వాహకులు ఆహ్వానించారు. ముందుగా శివకుమార్‌రెడ్డి ఆ తండాకు వెళ్లి పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. దీంతో ఎమ్మెల్యేకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఇలా అంతర్గతంగా  ఉన్న విభేదాలు శనివారం ఒక్కసారిగా బయటపడటంతో జిల్లాలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement