
విశాఖపట్నం: ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తే పవన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ పవర్ స్టార్ కాదని, ఆయనో పిరికి స్టార్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఒకటే వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు జరిగిందో అలాగే ఉంటుందని, మిగిలిన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పిన విషయాన్ని అమర్‌నాథ్ గుర్తు చేశారు.
ఆ రికార్డు పవన్ పేరిటే ఉంది..
జనసేన ఆరు ఏళ్లలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుని రికార్డు ఘనత సాధించిందని ఎమ్మెల్యే అమర్‌నాథ్ చురకలంటించారు. పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు చోట్ల ఓడిపోయిన రికార్డు కూడా పవన్ పేరిట ఉందని ఎద్దేవా చేశారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. నిన్న కన్నా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా అని కన్నాని సూటిగా ప్రశ్నించారు. ఆయన భూములు సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఇష్టం లేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి బీజేపీ తోక పార్టీలా మారిందని, దానికి జనసేన ఈక పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలో టీడీపీతో జనసేన లోపకారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment