
గూడూరు నారాయణరెడ్డి, దానం నాగేందర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్‌ది పక్కా అవకాశవాద రాజకీయమని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు పవర్‌లో ఉన్న పార్టీల పట్ల మాత్రమే ప్రేమ ఉంటుందని మండిపడ్డారు. బీసీ నాయకుడుగా ఆయన ఎప్పుడూ వారి సమస్యలపై పోరాడలేదనీ, పదవులకోసమే రాజకీయాలు చేసేవారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్న దానం.. గతంలో మంత్రి పదవులెలా పొందారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పీజేఆర్, శశిధర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినా నాగేందర్‌కే మంత్రి పదవులు, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలు మారడం దానంకు కొత్తకాదనీ.. టీఆర్‌ఎస్ ఓడినా, గెలిచినా ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరతారని నారాయణరెడ్డి జోస్యం చెప్పారు. ఏదేమైనా కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.