అహ్మదాబాద్: అత్యంత హోరాహారీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెల్లడికానున్న నేపథ్యంలో పటీదార్ నేత హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల)ను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన అన్నారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హార్థిక్ పటేల్ వరుస ట్వీట్లలో సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన హార్థిక్ పటేల్.. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడంతో ఈ ట్వీట్లను పటీదార్లు (పటేల్ సామాజికవర్గం) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు కూడా ఉంటున్నాయి. వడోదరలోని కర్జాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఎన్నికల ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టేరీతిలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే
ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
హార్థిక్ వరుస ట్వీట్లలో ఏమన్నారంటే..
‘గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే గుజరాత్ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది.
ఈవీఎం రిగ్గింగ్‌కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్‌లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే..’ అని హార్థిక్ అన్నారు. ఈవీఎంలను పక్కనబెట్టి మళ్లీ బ్యాలెట్ బ్యాక్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందని హార్థిక్ పేర్కొన్నారు.
రేపే ఫలితాలు!
గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈవీఎంలు వాడటంతో ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీకి మెజారిటీ దక్కనుందో ట్రెండ్‌ను బట్టి తేలిపోనుంది. గుజరాత్‌లో 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో 68స్థానాలకు లెక్కింపు జరగనుంది. రెండుచోట్లా బీజేపీ గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment