మంత్రి రేవణ్ణ
సాక్షి, బెంగళూరు: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 170 కిలోమీటర్ల ప్రయాణం రోజూ చేయడమంటే మాటలా? కానీ నమ్మకం అలా చేయిస్తోంది. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోదరుడు, ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ జ్యోతిష్య నమ్మకాలతో రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజూ నియోజకవర్గం (హోళెనరసిపుర) నుంచి రాజధాని బెంగళూరుకు రానుపోను ప్రయాణాలు సాగిస్తున్నారు. బెంగళూరులోని బనశంకరి ఫేజ్–2లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లు కూడా ఉన్నాయి.
అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్నన్నాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పారట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించినట్లు తెలుస్తోంది.
మంత్రి ఏమంటున్నారు?
మంత్రి రేవణ్ణకు ఇంత వరకు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప ఉన్న బంగ్లాలో రేవణ్ణ చేరాల్సి ఉంది. కానీ మహదేవప్ప మూడు నెలల గడువు కోరారు. రోజూ నియోజకవర్గం నుంచి బెంగళూరుకు రాకపోకలపై మంత్రి రేవణ్ణ స్పందిస్తూ.. ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తోంది’ అని చెప్పారు. బెంగళూరు– హోళెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే ప్రయాణం. ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment