
సాక్షి, హైదరాబాద్: ఓటు వేసినా ప్రయోజనం లేదనే భావనలో ఉన్నారో, వరుస సెలవులని ఎంజాయ్ చేశారోగానీ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఓటర్లు ఈసారి పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఓ మోస్తరు పట్టణాలు, కొత్త జిల్లా కేంద్రాలు, కొన్ని మండలాలు కలిసి ఉన్న పట్టణ నియోజకవర్గాల్లో 70 శాతానికి మించి ఎక్కడా పోలింగ్ జరగకపోవడం శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో గ్రామీణ ఓటర్లు మాత్రం పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూలు కట్టి మరీ ఓట్లేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామీణ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా 83 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో జరగడం గమనార్హం.
అధిక పోలింగ్ నియోజకవర్గాలివే...
70 శాతానికిపైగా పోలైన నియోజకవర్గాల్లో సిర్పూర్, ఆసిఫాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, చేవె ళ్ల, షాద్‌నగర్, దేవరకద్ర, మక్తల్, ఆలంపూర్, హుజూర్‌నగర్, తుంగతుర్తి, వైరా, భద్రాచలం, భూపాలపల్లి, పరకాల, అశ్వారావుపేట, ములుగు, ఆలేరు, వికారాబాద్, దుబ్బాక లాంటి గ్రామీణ ప్రాంతాలుండడం గమనార్హం. కొమురంభీం, సిద్దిపేట జిల్లాల్లో 78 శాతం పైగా ఓటింగ్ జరిగింది.
హైదరాబాద్‌లో గడప దాటని ఓటర్
ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లో తెలంగాణలో 69.5 శాతం ఓటింగ్ జరగ్గా, ఈసారి 67 శాతానికి పడిపోయింది. హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ కేవలం 50.86 శాతం ఓటింగ్ జరగడం గమనార్హం. కంటోన్మెంట్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, చార్మినార్, నాంపల్లి నియోజకవర్గాల్లో 50 శాతంకన్నా తక్కువగా పోలింగ్ జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోనైతే కేవలం 44.02 శాతమే నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ తక్కువగానే నమోదైంది. శుక్రవారం నుంచి మూడు రోజులు వరుస సెలవులు రావడంతో నగరంలోని అనేకమంది ప్రయాణాలు పెట్టుకున్నారు. అటు పట్టణ ప్రజలకు సంబంధించి పెద్దగా ఎన్నికల వాగ్దానాలు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. గ్రామాల్లోనైతే పథకాలతో లబ్ది పొందడంతోపాటు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు కూడా గ్రామీణ ప్రజలను ఉద్దేశించినవే ఎక్కువ కావడంతో పల్లెల్లో ఓటింగ్‌పై ఆసక్తి కనబరిచారు.
ఫలితాలు తారుమారవుతాయా?
గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పోలింగ్‌పై ఆసక్తి చూపడం, పట్టణ ఓటర్లు పెద్దగా స్పందించకపోవడం ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజల్లో సానుకూలత ఉందని, పట్టణ ప్రాంతాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పోలింగ్‌లో గ్రామీణ ఓటర్లే ఎక్కువగా పాల్గొనడంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటరు స్పందించకపోవడం, గత ఎన్నికలకన్నా పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోవడం లాంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది.