ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కాస్త పుంజుకోవడం ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సానుకూలించనుందని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ ఆదాయం 7–9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఎఫ్‌ఎంసీజీ వినియోగంలో 65 శాతం వాటా కలిగిన పట్టణాల్లో వినియోగం స్థిరంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెరగొచ్చని తెలిపింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.5–1 శాతం మేర పెరిగి, కరోనా ముందున్న 20–21 శాతానికి చేరుకుంటాయని పేర్కొంది.
ప్రధానంగా ఎడిబుల్ ఆయిల్, కెమికల్స్, ముడి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గడం కంపెనీల అధిక మార్కెటింగ్ వ్యయాలకు సర్దుబాటుగా ఉంటుందని తెలిపింది. రూ.5.2 లక్షల కోట్ల ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో 35 శాతం వాటా కలిగిన 76 ఎఫ్‌ఎంసీజీ సంస్థల పనితీరు ఆధారంగా ఈ నివేదికను క్రిసిల్ రేటింగ్స్ రూపొందించింది. అమ్మకాల పరంగా గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ 1–3 శాతం వృద్ధినే చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4–6 శాతం మధ్య ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వర్షాలపై తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాల ఆధారంగానే ఈ విశ్లేషణకు వచి్చనట్టు చెప్పారు.
సానుకూలం..
వరుసగా ఆరు త్రైమాసికాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు క్షీణతను చూడగా, 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లోనే సానుకూల వృద్ధి నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వినియోగ డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. కీలక పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని కూడా ప్రస్తావించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో పట్టణ వినియోగం రెండంకెల వృద్ధిని చూడగా, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం వల్ల ఈ వృద్ధి ఇక ముందూ కొనసాగొచ్చని అంచనా వేసింది.
స్థిరమైన డిమాండ్: మారికో
ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలో డిమండ్ ధోరణులు స్థిరంగా ఉన్నట్టు మారికో సైతం ప్రకటించింది. అయితే జూన్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అనుకున్నంతగా లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం శాంతించినందున ఈ ఏడాది మిగిలిన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జూన్ త్రైమాసికానికి సంబంధించి పనితీరుపై ప్రకటన విడుదల చేసింది. గడిచిన త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. సాధారణ వర్షపాత అంచనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడం, ద్రవ్యోల్బణం దిగిరావడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను క్రమంగా పెంచుతుందన్న ఆశలు కలి్పస్తున్నట్టు వివరించింది.
జూన్ త్రైమాసికంలో దేశీయ అమ్మకాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి కనిపించినట్టు ప్రకటించింది. సఫోలా వంట నూనెల నిల్వలను గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణమని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో పరంగా చానల్ ఇన్వెంటరీలో మార్పులు కూడా చేసినట్టు తెలిపింది. వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పెరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం గరిష్టంగా ఒక అంకె స్థాయిలో (7–8 శాతం) పెరిగినట్టు తెలిపింది. బ్రాండ్ల బలోపేతం, నూతన ఉత్పత్తులపై ప్రచారం కోసం అధికంగా ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment