గూండా రాజ్యం... బూతులు తిడుతూ యువతిపై దాడి | Hoogly Girl student Brutually attacked by TMCP leader | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 2:07 PM | Last Updated on Fri, Jan 19 2018 3:38 PM

Hoogly Girl student Brutually attacked by TMCP leader - Sakshi

సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ లో హేయమైన ఘటన వెలుగు చూసింది. అధికారం ఉందన్న మదంతో ఓ యువనేత.. ఓ యువతిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బండబూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ... ఆమెపై దాడికి పాల్పడ్డాడు.  ఆ దృశ్యాలు మీడియాకు చిక్కటంతో అధికార పక్షంపై విమర్శలు మొదలయ్యాయి.  

హూగ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగానికి(టీఎంసీపీ) జనరల్‌ సెక్రెటరీ షాహిద్‌ హసన్‌ ఖాన్‌. బాధిత విద్యార్థిని స్థానికంగా ఉన్న రిష్రా కాలేజీలో కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. దీనికి తోడు ఆమె కూడా టీఎంసీపీ స్టూడెంట్‌ సభ్యురాలే. అయితే పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతూ షాహిద్‌ అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ విషయంపై సదరు యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను యూనియన్‌ కార్యాలయానికి రప్పించుకుని మరీ షాహిద్‌ దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను చితకబాదాడు. కాలితో తన్నటం, జుట్టు పట్టుకుని లాగేయటం..  అసభ్యంగా తాకటం.. అడ్డుకునేందుకు తోటి సభ్యులు ప్రయత్నించినా వారిని తోసేస్తూ ఆమెపై దాడి చేశాడు. డిసెంబర్‌ 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ సీసీ ఫుటేజీ దృశ్యాలు  ఇప్పుడు బయటకు పొక్కాయి.

‘‘షాహిద్‌ నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. ఒక్కరోజే కాదు. ఈ దాడుల పర్వం కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. లైంగికంగా కూడా నన్ను వేధించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదరిస్తున్నాడు. అతని తండ్రి జహీద్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ కావటంతో షాహిద్‌ ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయి. యూనియన్‌ ఫండ్‌ను దుర్వినియోగం చేయటం.. ఎదురు ప్రశ్నించిన వారిని ఇలా చితకబాదటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాలేజీకి వెళ్లాలంటే భయంగా ఉంది’’ అని యువతి చెబుతున్నారు. 

షాహిద్‌పై వేటు... 

కాగా, సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి రావటంతో స్పందించిన రిష్రా కాలేజీ యాజమాన్యం షాహిద్‌ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అతన్ని జనరల్‌ సెక్రెటరీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయ దత్తా తెలిపాడు. విద్యాశాఖా మంత్రి పార్థ ఛటర్జీ ఘటనపై అధికారులను సమగ్ర నివేదికను కోరారు. అయితే తనకేం తెలీదని.. ఆ అమ్మాయి తాను మంచి స్నేహితులమని.. పైగా తోటి సభ్యురాలిపై దాడి చేయాల్సిన అవసరం తనకేంటని జహీద్‌ బుకాయిస్తున్నాడు.

మరోవైపు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు షాహిద్‌పై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలన గూండా రాజ్యంగా మారిందనటానికి మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అన్నిచోట్లా జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక మీడియాలో చర్చనీయాంశమైంది.

సీసీ ఫుటేజీ దృశ్యాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement