సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తాజాగా ఎంపీల రాజీనామాలను సైతం ఆమోదింపజేసుకోవడంతో అధికార టీడీపీలో కలవరం మొదలైంది. విపక్ష ఎంపీల రాజీనామాలకు ఆమోదం లభించడంతో వారికి వ్యతిరేకంగా తాము చేస్తున్న ప్రచారం సరికాదనే వాదనకు బలం చేకూరిందనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా, ఎంపీల రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాసంపై రకరకాలుగా మాటలు మార్చిన టీడీపీ పరిస్థితి చివరకు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
నాలుగేళ్లు వ్యతిరేకించి చివరకు జగన్ బాటలోనే...
హోదా సాధన కోసం పోరాటం చేసే క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని ప్రకటించినప్పుడు సీఎం చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఢిల్లీలో పార్లమెంట్ లోపల, బయట వైఎస్సార్ సీపీ పోరాడుతుంటే బీజేపీతో కలిసిపోయారని టీడీపీ దుష్ప్రచారం చేసింది. హోదా కోసం స్పష్టమైన పోరాట కార్యాచరణతో కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడతామని విపక్షం ప్రకటించినప్పుడు అది అనవసరమని, దానివల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చివరకు వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగినప్పుడు కూడా దాన్ని వక్రీకరిస్తూ ఆరోపణలు చేశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ వేసిన ప్రతి అడుగునూ వ్యతిరేకించిన చంద్రబాబు, ఆయన బృందం వక్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం అనంతరం ఎన్డీఏ నుంచి బయట పడ్డాక చివరకు జగన్ బాటనే అనుసరించక తప్పలేదని టీడీపీ సీనియర్లు పేర్కొంటున్నారు.
హోదాపై పిల్లిమొగ్గలు, యూటర్న్‌లు
ప్రత్యేక హోదా అంశంపై తమ అధినేతకు మొదటి నుంచి స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల ప్రతిసారీ ఇరుకునపడుతున్నామని టీడీపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా కావాలని, అందుకోసం పోరాడుతున్నట్లు ఇప్పుడు చెప్పుకుంటున్నా మొదట్లో అసలు హోదాయే అవసరం లేదని తమ అధినేత ప్రకటించి తప్పు చేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది. హోదా వల్ల ఎటువంటి ప్రయోజనాలు రావని, హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగిందో తనకు చూపించాలని, హోదాకు మించిన ప్యాకేజీ సాధించామని, దేశంలో తమకంటే ఎక్కువగా కేంద్రం నుంచి ఏ రాష్ట్రం కూడా సాధించలేదని బీజేపీతో కలిసి ఉన్నప్పుడు తమ అధినేత పదేపదే చెప్పటాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
జీర్ణించుకోలేకపోతున్నటీడీపీ శ్రేణులు
బీజేపీతో తెగతెంపుల తర్వాత ఒక్కసారిగా రూటు మార్చిన చంద్రబాబు ఉన్నట్టుండి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడాన్ని టీడీపీ శ్రేణులే చాలాకాలం జీర్ణించుకోలేకపోయాయి. ప్రత్యేక హోదా కావాలంటూ తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికీ ఇబ్బంది పడాల్సి వస్తోందని గోదావరి జిల్లాలకు చెందిన ఒక టీడీపీ ముఖ్యనేత వాపోయారు. కేంద్రంపై అవిశ్వాసం అవసరం లేదని చంద్రబాబే చెప్పారని కానీ వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టడంతో ఒత్తిడికి గురై మద్దతిస్తామని ప్రకటించారని, కానీ తెల్లారేసరికి మాట మార్చి తామే అవిశ్వాసం పెడతామని చెప్పారని ఇవన్నీ తమ పార్టీ అధినేత చేసిన తప్పులని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.
బెడిసిన వ్యూహం.. పరువు గల్లంతు
వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాల విషయంలోనూ తమ వ్యూహం బెడిసికొట్టిందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు రావని తెలిసే రాజీనామాలు చేశారని వక్రీకరిస్తూ పైకి ఆరోపణలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యేక హోదా, కేంద్రంపై అవిశ్వాసం, ఎంపీల రాజీనామాల సహా ఏ విషయంలోనూ టీడీపీ వైఖరి స్పష్టంగా లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామనే ఆందోళన టీడీపీలో నెలకొంది. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లడం, ఇప్పుడు అవి ఆమోదం పొందడంతో ప్రజల నుంచి తమపైనా ఒత్తిడి ఉందని గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.
అంతా మేకపోతు గాంభీర్యం..
తాము ఎంత సర్ది చెప్పుకుంటున్నా వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ ఎంపీలు కూడా ఎందుకు రాజీనామాలు చేయలేదనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. వైఎస్ జగన్ తమ ఎంపీలతో రాజీనామాలు చేయించే సమయంలో టీడీపీ కూడా తమతో కలిసి రావాలని, అంతా కలసి రాజీనామాలు చేస్తే కేంద్రం కచ్చితంగా దిగి వస్తుందని సూచించటం తెలిసిందే. కానీ తమ చంద్రబాబు డొంక తిరుగుడు రాజకీయంతో ఇప్పుడు ఇరకాటంలో పడ్డామని, ప్రత్యేక హోదా అంశంలో మొదటి నుంచి తమ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల్లో చులకనైపోయిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అనుకూల మీడియా సహకారంతో వైఎస్సార్ సీపీపై ఎదురుదాడి చేస్తూ మేకపోతు గాంభీర్యం నటిస్తున్నా తమ నాయకులు నియోజకవర్గాల్లో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారనే ఆందోళన టీడీపీలో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment