
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్న వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మ, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు
సాక్షి ప్రతినిధి కడప: పద్నాలుగు నెలలపాటు జరిగిన ప్రజాసంకల్ప యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి సొంత నియోజకవర్గం వైఎస్సార్ జిల్లా పులివెందులకు వచ్చిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు స్థానిక ప్రజలు పోటెత్తారు. తండోపతండాలుగా తరలివచ్చారు. అసలే పులివెందులకు ముద్దబిడ్డ.. మధ్యలో హత్యాయత్నం ఘటన.. ఆపై పద్నాలుగు నెలల నిరీక్షణ అనంతరం ఆయన రాకతో మిద్దె, మేడా, చెట్టు, పుట్ట అనే తేడా లేకుండా జనం ఎగబడ్డారు. పట్టణంలోని సీఎస్‌ఐ చర్చికి వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలుసుకున్న పులివెందుల వాసులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఇసుకేస్తే రాలనట్లుగా ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సీఎస్‌ఐ చర్చి వరకు భారీగా ప్రజానీకం చేరుకున్నారు. దీంతో అభిమాన తరంగానికి ముగ్థుడైన జననేత తన వాహనం నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారిపొడవునా చిరునవ్వులతో పలకరిస్తూ చర్చికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ, భారీ ఊరేగింపు చేపట్టారు. అప్పటికే చర్చికి చేరుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధుసూధనరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి తదితర వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నుంచి గండి ఆంజనేయస్వామి దర్శనానికి బయల్దేరారు. అభిమానులు అడుగుడుగునా కాన్వాయ్‌ని ఆపడంతో ఎంతో ఓపిగ్గా వారిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో బెస్తవారిపల్లె సమీపంలో ఉన్న మదరసా విద్యార్థులు, అక్కడి ముస్లిం మతపెద్దలు రోడ్డుపైకి వచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన మదరసాలోకి వచ్చి వెళ్లాలని అభ్యర్థించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన వైఎస్ జగన్ లోపలికి వెళ్లగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
గండి అంజన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
అక్కడ నుంచి ప్రసిద్ధ గండి క్షేత్రంలోని ఆంజనేయస్వామిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణఫలంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండి దేవస్థానం ప్రధాన అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గండి ఆంజన్న ఆశీస్సులు పొందిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయకు బయల్దేరారు.
14 నెలల అనంతరం వైఎస్సార్ ఘాట్‌కు..
ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించే ముందు 2017 నవంబరు 6న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ జగన్.. పాదయాత్ర ముగింపు అనంతరం, 14 నెలలు తర్వాత శనివారం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి మరోసారి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అప్పట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి నేరుగా కడప పెద్దదర్గా, పులివెందుల సీఎస్‌ఐ చర్చి, గండి క్షేత్రంలో ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ముగిశాక అదే క్రమంలో తిరిగి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, ఇడుపులపాయలో శనివారం చేపట్టిన ప్రార్థనల్లో తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్‌బి అంజాద్‌బాషా, రాజంపేట, కడప పార్లమెంటు అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కె సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలలోని అనేకమంది నాయకులు వందలాది వాహనాల్లో తరలివచ్చి వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వచ్చి చేరారు. ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ గఫార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీరాం సతీష్, రాష్ట్ర ముదిరాజు సంఘ ప్రధాన కార్యదర్శి ఈర్ల గురవయ్య, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ గౌరవాధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వర్లు తదితరులతోపాటు వందలాది మంది కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్ జగన్ అందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు భారీ కాన్వాయ్‌తో వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంబేపల్లె మాజీ జెడ్పీటీసీ, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జి.ఉపేంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ తదితరులూ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చిదంబరరెడ్డి, వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డిలు కూడా ఉన్నారు. అలాగే, జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా వాహనాల్లో వచ్చి పార్టీలో చేరారు. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో కూడా మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి తన అనుచరులతో చేరారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి దాదాపు 200 వాహనాల్లో తన అనుచరులతో ఇడుపులపాయ వచ్చారు. మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు కూడా వందలాది తమ అనుచరులతో పార్టీలో చేరారు.
మీ ఆశీస్సులు ఎల్లప్పుడు తోడుండాలి: వైఎస్ జగన్
కాగా, పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించే ముందు రోజు మీ అందరి దీవెనలు, ప్రార్థనలవల్లే దాదాపు 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగలిగానని చెప్పారు. కలకాలం మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకు, మా కుటుంబానికి తోడుండాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment