సాక్షి, చెన్నై: తాను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక పర్యటన తన గురించి తాను తెలుసుకోవడానికేనని పేర్కొన్నారు. ‘నేను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదు. నా పార్టీ పేరును ప్రకటించలేదు. ఇప్పుడు రాజకీయాల గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని రజనీ అన్నారు. రిషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై రజనీ మాట్లాడటం లేదని కమల్ హాసన్ చేసిన విమర్శలపై స్పందించాలని మీడియా ఆయనను కోరగా.. ఈ విధంగా బదులిచ్చారు.
త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆయన జమ్మూలోని శివగుహను, ధర్మశాలను సందర్శించిన ఆయన.. రిషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రయంలో కొన్నిరోజులు ధ్యానం చేయనున్నారు.
రజనీకాంత్ విధానాలను విమర్శించేందుకు తాను సిగ్గుపడబోనని కమల్ హాసన్ తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 'నేను రజనీకాంత్ మంచి మిత్రులం.. అయితే, ఆయన విధానాలు విమర్శించేందుకు సిగ్గుపడబోను. అది కేవలం ఆయన విధానాలకు, నిబంధనలకు మాత్రమే పరిమితమై ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఉండబోదు. ఆయనను ముందు రానివ్వండి (రాజకీయాల్లోకి).. పార్టీ పేరును ప్రకటించనివ్వండి. నేను మాత్రం ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను.. నా పార్టీ ముఖ్య విధానం ప్రజా సంక్షేమం. అలాగే, రజనీని కూడా ఆయన విధానాలు ప్రకటించనివ్వండి.. అందులో ఏవైనా మా పార్టీకి సంబంధించి ఉంటాయేమో చూద్దాం. ఇరువురి విధానాల్లో కొంత భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నేను మాత్రం పార్టీ విధాన పరంగానే విమర్శలు చేస్తానుగానీ వ్యక్తిగతంగా కాదు.. అదే రాజకీయపరంగా గౌరవం కూడా' అని కమల్ అన్నారు. మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీని ప్రకటించిన కమల్ ప్రస్తుతం జిల్లాల పర్యటన చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment