పలుగు, పార పక్కనపెట్టు.. నాయకునికి జైకొట్టు.. కూలీడబ్బులతో పాటు బీరు, బిర్యానీ చేతబట్టు.. ఇటు రాజధానిలో, అటు జిల్లాలలో ఇప్పుడిదే అడ్డా కూలీల ‘దినచర్య’. గత నెలంతా చేతినిండా పనిలేక పస్తులున్న కూలీలు.. ఎన్నికల పుణ్యమా అని అభ్యర్థులకు ‘నోటి’నిండా ‘జై’ కొడుతూ మస్తు ఉపాధి పొందుతున్నారు. ఎన్నికల రంగస్థలంలో ఇప్పుడు మందీమార్బలం పాత్ర వీరిదే. మరోవైపు ఆటోవాలాలకు, బ్యానర్లు ప్రింట్ చేసేవారికి, సౌండ్‌సిస్టమ్‌లు అద్దెకిచ్చే వారికీ బంపర్ ఆఫర్ తగిలింది.
నగరంలో కూలీలకు గిరాకీ
నగర శివారులో మొన్నటి వరకు నిర్మాణరంగం జోరుమీదుండేది. రాజేంద్రనగర్, శంషాబాద్, కొండాపూర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్ శివార్లలో ప్రస్తుతం బహుళ అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి కోసం నగరంలోని శివరాంపల్లి, అడ్డగుట్ట, కాటేదాన్, మాణికేశ్వరినగర్, ఉప్పల్ తదితర ప్రాంతాలు లేబర్ అడ్డాలకు బిల్డర్లు రోజూ వచ్చి కూలీలను తీసుకెళ్తుంటారు. నగరంలో కార్మిక శాఖ లెక్కల ప్రకారం అధికారికంగా నమోదైన కూలీల సంఖ్య లక్షలకు పైమాటే.
ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆంక్షలు, నగదు తరలింపుపై నిఘాతో నిర్మాణరంగం జోరు తగ్గింది. అడ్డా కూలీలంతా నెలపాటు పనిదొరక్క ఖాళీ అయిపోయారు. ఇప్పుడన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన దరిమిలా.. ముఠామేస్త్రీల ద్వారా కూలీలను ప్రచారానికి పిలుస్తున్నారు. నగరంలో మహిళలకు రూ.500, పురుషులకు రూ.700 ముట్టచెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 11,00,000 మంది వరకు ఉంటారు. వీరిలో మహిళలకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నారు.
కర్ణాటక, ‘మహా’, ఏపీ నుంచి..
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అభ్యర్థులు.. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన తెలుగు కూలీలను ప్రచారానికి వాడుతున్నారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థులు పొరుగునున్న మహారాష్ట్ర నుంచి కూలీలను తెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కూలీలు ఎన్నికల ఉపాధి పొందుతున్నారు. వీరంతా డిసెంబరు 5 వరకే రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో ‘ప్రచారం’లో పాల్గొంటారు. వీరి ఓట్లన్నీ ఆయా జిల్లాల్లోనే ఉండటంతో అదేరోజు రాత్రికి తమ ఊళ్లకు వెళ్లిపోతారు.
ఇదీ కూలీల ‘దినచర్య’
ఉదయం లేస్తూనే కాస్త ముస్తాబై.. తమను బుక్ చేసుకున్న అభ్యర్థి ఇల్లు లేదా ఆఫీసుకు వెళ్లాలి. ఆ రోజు ప్రచారం షెడ్యూల్ ఏమిటో అక్కడ తెలియ చెబుతారు. ఇక, అభ్యర్థి ప్రచారం మొదలైన దగ్గరి నుంచి ముగిసే వరకు వీరంతా వెన్నంటే ఉండాలి. బ్యానర్లు, జెండాలు చేతబట్టి, దారిపొడవునా జిందాబాద్‌లు కొడుతూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగాలి. చూసే వారికి వీరంతా పార్టీ కార్యకర్తలే అనిపిస్తుంది. కానీ, అభ్యర్థి ‘మంది’బలం చాటుకోవడానికీ వీరు ఉపయోగపడుతుంటారు.
ఇలా చేసినందకు వీరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా రెండుసార్లు చాయ్ ఇస్తున్నారు. మధ్యాహ్నం బిర్యానీ తెప్పిస్తున్నారు. సాయంత్రానికి కూలీ డబ్బులతో పాటు మగవారికి బ్రాండులను బట్టి, బీరు, క్వార్టర్ సీసాలను పంచుతున్నారు. వాస్తవానికి నగరంలో ఒకరోజు కూలీ రూ.800 నుంచి వెయ్యి దాకా ఉంది. వీరు రోజంతా కాయకష్టం చేస్తే వచ్చే కూలీ కన్నా అభ్యర్థులిచ్చేది తక్కువే. కానీ, కష్టం, రిస్కు రెండూ తక్కువే కాబట్టి, ‘ప్రచార కూలీ’కే వలస కూలీలు ‘సై’ అంటున్నారు.
బ్యానర్..స్టిక్కర్.. లక్షల్లో బిజినెస్
నగరంలో ఫ్లెక్సీలపై నిషేధం ఉండటంతో ఈ దఫా అభ్యర్థులంతా వస్త్రాలతో తయారుచేసే బ్యానర్లపై దృష్టి పెట్టారు. వీటిని తయారు చేసే వారికీ ప్రస్తుతం మంచి గిరాకీ ఏర్పడింది. స్టిక్కర్లు, కరపత్రాలు, టోపీలు, కండువాలు, కీచెయిన్లు, బ్యానర్లు అంతా కలిపి ప్యాకేజీ రూపంలో ఒకరే తయారు చేసి ఇస్తుండటంతో వీటిని తయారు చేసే వ్యాపారులకు చేతినిండా పని దొరికింది. ఈ ప్యాకేజీలపై రూ.4 లక్షలు మొదలుకుని రూ.50 లక్షల దాకా వ్యాపారం జరుగుతోంది. ఇక ఆటోలకు పార్టీ ప్రచార స్టిక్కర్లు, బ్యానర్లు తగిలించాలంటే రోజుకు రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు వైర్‌లెస్ స్పీకర్లకూ ‘సౌండ్’ పెరిగింది. వీటిని రోజుకు రూ. 2,000 అద్దె ప్రాతిపదికన ఇస్తున్నారు.
ముఠామేస్త్రీలదే కీలకపాత్ర
ప్రస్తుత ఎన్నికల సందర్భంలో ముఠామేస్త్రీలు చక్రం తిప్పుతున్నారు. కూలీలకు పని చెప్పేది వీరే. కూలీలు కావాలంటే మొదట వీరినే ఆశ్రయించాలి. అన్ని పార్టీల నాయకులు దాదాపు రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉంటారు. వీరందరితో మేస్త్రీలకు పరిచయాలు ఉంటాయి. ఒకరికి మనుషులను పంపి, ఇతరులకు పంపకపోతే.. సంబంధాలు చెడిపోతాయి. అందుకే, ముఠామేస్త్రీలు అన్ని పార్టీల అవసరాలకు అనుగుణంగా కూలీలను పంపిస్తూ అందరితో సఖ్యతగా ఉండేందుకు యత్నిస్తున్నారు.
మొదట మేస్త్రీలు కూలీలను పార్టీల వారీగా విభజిస్తారు. ప్రచారపర్వం ముగిసే వరకు ఏ ‘పార్టీ’ కూలీలను ఆ పార్టీల అభ్యర్థుల వద్దకే పంపిస్తారు. లేదంటే నినాదాలిచ్చేటపుడు తేడా వచ్చే ప్రమాదముంది. అందుకే కూలీలను ఒకే పార్టీకి ఫిక్స్‌డ్‌గా ఉంచుతారు. మొత్తానికి నిర్మాణ రంగంలో పనుల్లేని పరిస్థితుల్లో తమవారికి ‘ఎన్నికల పని’ ఇప్పించడంలో మేస్త్రీలు సఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment