సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ కమిటీల పేరుతో బెంగాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం, పార్టీ నేతలు పబ్బం గడుపుకునేలా చేసి ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్నట్టే తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా దెబ్బతినక తప్పదని బీజేపీ పేర్కొంది. పార్టీ కార్యకర్తల నిరుద్యోగ సమస్య తీరేలా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణంకాక తప్పదని ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు.
సోమవారం ఆయన పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సుభాష్, సుధాకరశర్మలతో కలసి విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతుల పేరుతో 20 వేలమందిని రంగంలోకి దింపి పార్టీ కార్యకర్తలకు మేలు చేసుకుందని, ఇప్పుడు రైతు సమన్వయ కమిటీ పేరుతో టీఆర్‌ఎస్ కార్యకర్తల లబ్ధికోసం కేసీఆర్ యత్నిస్తున్నారని, దీనివల్ల రైతులకు జరిగిన ఉపయోగం శూన్యమన్న విషయం ప్రజలు గుర్తిస్తారన్నారు.
తన తప్పులు కనిపించకుండా కేంద్రంపై కేసీఆర్ నిందలు మోపుతున్నారని ఆరోపించారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ధర నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాలే ధాన్యాన్ని సేకరించాలని, అందులో నష్టం వస్తే 45 శాతం కేంద్రం భరిస్తుందంటూ నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపటం ఏంటని ప్రశ్నించారు.
ఆధార్ అనుసంధానంలో రాష్ట్రం ముందంజ: కేంద్రమంత్రి చౌదరి
కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు వచ్చాయని కేంద్రమంత్రి సీఆర్ చౌదరి పేర్కొన్నారు. కార్డులను ఆధార్‌తో అనుసంధానించటం సత్ఫలితాలిస్తోందని వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆధార్ అను సంధానం విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని సీఆర్ చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment