సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పెత్తందార్ల పార్టీ అని మరోసారి చెప్పదల్చుకుందా లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సానుకూలంగా ఉంటుందా అని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపు అధికారాన్ని రాష్ట్రానికి కట్టబెట్టాలంటూ శుక్ర వారం లోక్‌సభలో ఆందోళన నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, నగేశ్, బీబీ పాటిల్, దయాకర్.. సభ వాయిదా పడిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా వినోద్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేసిన రిజర్వేష న్ల పెంపు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి, రాజ్యాంగ సవరణ చేయడంతోపాటు షెడ్యూల్ 9లో పొందుపరిచి ఎస్టీలు, మైనారిటీలకు రక్షణ కల్పించాలని పది నెలలుగా తిరుగుతున్నం. చేస్తం.. చూస్తం అని మాట్లాడుతున్నరు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటి పెంపుపై ఏమీ చేయలేమని హోంశాఖ రాజ్యసభలో గురువారం ఒక ప్రశ్నకు బదులిచ్చింది. దీన్నిబట్టి చట్టాల గురించి కేంద్ర మంత్రులు, అధికారులకు అవగాహన లేదని తెలుస్తోంది. ఏదైనా పరిస్థితుల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లను 50 శాతానికిపైగా పెంచాలనుకున్నప్పుడు పెంచుకోవచ్చని, దానికి స్పష్టమైన జనాభా సంఖ్యను చూపించాలని సుప్రీంకోర్టు అదే తీర్పులో చెప్పింది’’ అని వినోద్ పేర్కొన్నారు.
తెలంగాణలో గిరిజన జనాభా అధికం
గిరిజనుల శాతం అవిభక్త ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందని, అందుకే 2 పార్లమెంటు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వేషన్ కలిగి ఉన్నాయని వినోద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి పంపినా కేంద్రం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపైనే తాము పార్లమెంటు లోపలా, బయటా నిరసన తెలుపుతున్నామన్నారు.
బీజేపీ పెత్తందార్ల పార్టీగా అని మరోసారి దేశ ప్రజలకు చెప్పదలుచుకుందా లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సానుకూలంగా ఉంటామని చెబుతుందా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘కేసీఆర్ ఆదేశానుసారం గత ఐదు రోజులుగా పోరాటం చేస్తున్నాం. కేంద్రం చాలా అన్యాయం చేస్తోంది. ఎందుకు దాటవేస్తోందో తెలియడం లేదు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment