సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్న గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ఎన్నడూ విభజన హామీలపై స్పందించలేదని టీఆర్‌ఎస్ ఎంపీ బి. వినోద్‌కుమార్ విమర్శించారు. హామీల సాధనలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తాము ప్రతి పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీల అమలు కోసం పట్టుబడుతున్నామన్నారు.
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా హైకోర్టు విభజన కాకపోవడానికి టీడీపీ ప్రభుత్వ తీరే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరి అవలంబించి ఉంటే ఈపాటికి హైకోర్టు ఏర్పాటయ్యేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పెద్ద విషయం కాదని, అది ఒక చిన్న చర్చ మాత్రమే అన్నారు. అందులో తాము పాల్గొంటామని, ఓటింగ్ వస్తే పాల్గొ నాలా వద్దా అన్నది అప్పుడు నిర్ణయించుకుంటామని తెలిపారు.
మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.17 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని అవిశ్వాసంపై చర్చలో ప్రస్తా విస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖను సభలో ప్రస్తావిస్తామన్నారు. అంతకుముందు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో సమావేశమైన పార్టీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment