vinodh kumar
-
వినోద్ బాటలో శంకర్రావు, వేణుమాధవ్..
సాక్షి, హైదరాబాద్ : టికెట్‌పై ఆశపడి భంగపడ్డారు. ఆనక భవిష్యత్తుపై బెంగతో బరిలోకి దిగుతున్నారు. గెలుపుపై గంపెడాశతో ముందుకు సాగుతున్నారు. టికెట్ దక్కుతుందన్న ఆశతో ఇంతకాలం పార్టీకి సేవ చేసినా మొండిచేయి చూపారన్న బాధ, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో పోటీ చేసినా ప్రయోజనముండదన్న ఆందోళన ఆయా నేతలను బరిలో దిగేందుకు ప్రేరేపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడినవారితో అధినాయకత్వాలు చర్చలు జరుపుతున్నాయి. అధినేతలు ఎంత నచ్చజెప్పినా పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఎలాగైనా పోటీ చేయాలని నిర్ణయించుకుని చిన్న పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు, జాతీయ పార్టీలను ఆశ్రయించి టికెట్లు దక్కించుకున్నారు. గెలిస్తే అధికార పార్టీ రెడ్‌కార్పెట్ పరుస్తుందని, ఓడిపోతే కొంతకాలానికి పాత పార్టీ నిషేధం ఎత్తేస్తుందనే ధీమాతో ఉన్నారు. అనుచరుల ఒత్తిడి టికెట్ ఆశించి భంగపడ్డవారు అన్నిపార్టీల్లోనూ ఉన్నారు. వీరితోపాటు వీరి అనుచరుల భవిష్యత్తూ ఇప్పుడు గందరగోళంలో పడింది. సత్తా చాటాలన్నా పార్టీకి తమ విలువ తెలిసి రావాలన్నా పోటీలో ఉండాల్సిందేనని నాయకులపై కార్యకర్తలు, అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. పోటీ చేయకుంటే పార్టీలో, ప్రజల్లో ఉనికిని, ప్రాబల్యాన్ని కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఆయా పార్టీల అధినేతలు నచ్చచెప్పినా వీరు పట్టించుకోవడం లేదు. వినోద్‌బాటలో పలువురు నేతలు సొంతపార్టీలో పంతం నెగ్గించుకోలేని నాయకులంతా ఆఖరి క్షణాల్లో ఇతర పార్టీలను, చిన్నపార్టీలు, చివరికి ప్రత్యర్థి పార్టీలను సైతం ఆశ్రయించేందుకు వెనుకాడటం లేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్న మాజీమంత్రి గడ్డం వినోద్‌కుమార్ చెన్నూరు టికెట్ ఆశించారు. కానీ, ఆ టికెట్‌ను ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినా వినోద్ సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామని ఢిల్లీ వెళ్లి ఆఖరి నిమిషం దాకా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆయన బీఎస్పీ తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. మాజీమంత్రి శంకర్రావు కూడా షాద్‌నగర్ బరిలో నిలిచేందుకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు. ముథోల్ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌నేత రామారావు పటేల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ సూర్యనారాయణ గుప్తా శివసేన తరఫున నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ(చొప్పదండి) టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి టికెట్ సంపాదించారు. బొల్లం మల్లయ్య యాదవ్ (కోదాడ) టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి పోటీకి దిగుతున్నారు. నటుడు వేణుమాధవ్ చాలా ఏళ్లుగా టీడీపీ నుంచి కోదాడ టికెట్ ఆశిస్తున్నారు. 2014లో ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈసారి కూడా నెరవేరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నామినేషన్ వేశారు. -
ఉమ్మడి మెదక్‌లో అన్నీ గెలుస్తాం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచామని, ఈసారి అన్నీ గెలుస్తామని, రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నేతృత్వంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు రమణారావు, జమాలుద్దీన్, రాంచందర్, గడ్డం దశరథ, ఆంజనేయులుగౌడ్, నాయిని రమేశ్, మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు తదితరులు గురువారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ను వీడి బంగారు తెలంగాణ సాధనకు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ రెండు నెలలు పార్టీ కోసం గట్టిగా కష్టపడాలని కొత్తగా టీఆర్ఎస్లో చేరిన వారిని కోరారు. తర్వాత తాము ఐదేళ్ల పాటు ప్రజలు, కార్యకర్తల కోసం పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. అధికార పీఠం దక్కదన్న దుగ్ధతో ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. రాజకీయాలే తప్ప ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని.. అలాంటి నేతలు మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని, వారి మోసాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఎన్నికల భయం: తలసాని సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు ఎన్నికల భయం పట్టుకుందని... అందుకే ఓట్ల తొలగింపు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఓటరు జాబితాలో సవరణలకు ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికల కమిషన్ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణలపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వారి పరిస్థితిని చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ఇప్పుడు ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తోందని మండిపడ్డారు. అమిత్ షా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఈ సారి బీజేపీకి రెండు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అమావాస్యకో, పున్నమికో హైదరాబాద్ వచ్చే ఆజాద్ లాంటి నేతలకు టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సనత్‌నగర్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే స్వాగతిస్తానని, ఆయన ప్రచారం వల్ల తనకు లాభమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షులు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షుల్లా మారారని ఎంపీ బి.వినోద్‌కుమార్ విమర్శిం చారు. నాలుగేళ్లుగా సాగు నీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుపడి, ఇప్పుడు ఎన్నికల విషయంలోనూ అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఈద శంకర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌లతో కలసి వినోద్ గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వారు ఎవరి ప్రయోజనం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని ప్రశ్నిం చారు. ముందస్తు ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని విమర్శిం చారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతుంటే.. మరోవైపు ఆ పార్టీ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ‘కేసీఆర్‌ను ప్రజల మధ్య ఎదుర్కొలేక కాంగ్రెస్ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కుటిల రాజకీయం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుని ప్రజల్లో కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ఇప్పుడు వచ్చేవి 3 నెలల ముందస్తు ఎన్నికలే. ఓటరు జాబితాలో 70 లక్షల మంది పేర్లు తొలగించారని శశిధర్‌రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. జాబితాల్లో పేర్లు లేకుంటే కాంగ్రెస్ పిలుపునిచ్చి మళ్లీ నమోదు చేయించవచ్చు కదా. అసెంబ్లీ రద్దు తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాజ్యాంగం చెబుతోంది. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొందరు రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు’ అని వినోద్ వ్యాఖ్యానించారు. -
విభజన హామీలపై 4 ఏళ్లుగా స్పందించలేదేం?: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్న గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ఎన్నడూ విభజన హామీలపై స్పందించలేదని టీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్‌కుమార్ విమర్శించారు. హామీల సాధనలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తాము ప్రతి పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీల అమలు కోసం పట్టుబడుతున్నామన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా హైకోర్టు విభజన కాకపోవడానికి టీడీపీ ప్రభుత్వ తీరే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరి అవలంబించి ఉంటే ఈపాటికి హైకోర్టు ఏర్పాటయ్యేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పెద్ద విషయం కాదని, అది ఒక చిన్న చర్చ మాత్రమే అన్నారు. అందులో తాము పాల్గొంటామని, ఓటింగ్ వస్తే పాల్గొ నాలా వద్దా అన్నది అప్పుడు నిర్ణయించుకుంటామని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.17 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని అవిశ్వాసంపై చర్చలో ప్రస్తా విస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖను సభలో ప్రస్తావిస్తామన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో సమావేశమైన పార్టీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. -
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణలో వివిధ సామా జిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలంటూ పార్లమెంట్లో తాము చేస్తున్న ఆందోళనకు ఆ పార్టీనుంచి కనీస స్పందన లేదన్నారు. పార్లమెంటు వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదాపై సభలో సహకరిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుపై తమకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతోందన్నారు. రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే..కేంద్ర హోం శాఖ అడ్డుపడుతోందని మండిపడ్డారు. -
బీజేపీ పెత్తందార్ల పార్టీయా..?
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పెత్తందార్ల పార్టీ అని మరోసారి చెప్పదల్చుకుందా లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సానుకూలంగా ఉంటుందా అని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపు అధికారాన్ని రాష్ట్రానికి కట్టబెట్టాలంటూ శుక్ర వారం లోక్‌సభలో ఆందోళన నిర్వహించిన టీఆర్ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, నగేశ్, బీబీ పాటిల్, దయాకర్.. సభ వాయిదా పడిన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం చేసిన రిజర్వేష న్ల పెంపు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించి, రాజ్యాంగ సవరణ చేయడంతోపాటు షెడ్యూల్ 9లో పొందుపరిచి ఎస్టీలు, మైనారిటీలకు రక్షణ కల్పించాలని పది నెలలుగా తిరుగుతున్నం. చేస్తం.. చూస్తం అని మాట్లాడుతున్నరు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటి పెంపుపై ఏమీ చేయలేమని హోంశాఖ రాజ్యసభలో గురువారం ఒక ప్రశ్నకు బదులిచ్చింది. దీన్నిబట్టి చట్టాల గురించి కేంద్ర మంత్రులు, అధికారులకు అవగాహన లేదని తెలుస్తోంది. ఏదైనా పరిస్థితుల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లను 50 శాతానికిపైగా పెంచాలనుకున్నప్పుడు పెంచుకోవచ్చని, దానికి స్పష్టమైన జనాభా సంఖ్యను చూపించాలని సుప్రీంకోర్టు అదే తీర్పులో చెప్పింది’’ అని వినోద్ పేర్కొన్నారు. తెలంగాణలో గిరిజన జనాభా అధికం గిరిజనుల శాతం అవిభక్త ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందని, అందుకే 2 పార్లమెంటు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వేషన్ కలిగి ఉన్నాయని వినోద్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి పంపినా కేంద్రం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపైనే తాము పార్లమెంటు లోపలా, బయటా నిరసన తెలుపుతున్నామన్నారు. బీజేపీ పెత్తందార్ల పార్టీగా అని మరోసారి దేశ ప్రజలకు చెప్పదలుచుకుందా లేక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సానుకూలంగా ఉంటామని చెబుతుందా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘కేసీఆర్ ఆదేశానుసారం గత ఐదు రోజులుగా పోరాటం చేస్తున్నాం. కేంద్రం చాలా అన్యాయం చేస్తోంది. ఎందుకు దాటవేస్తోందో తెలియడం లేదు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారు’ అని పేర్కొన్నారు. -
విభజన హామీల అమలులో నిర్లక్ష్యం: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికిచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ వినోద్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అయితే ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో ఎలాంటి కాలపరిమితి విధించలేదన్నారు. దీంతో ఇదే సాకుగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటును తాత్సారం చేస్తోందన్నారు. ప్రస్తుతం హైకోర్టులో నియామకాలు చేపడుతుండడం వల్ల కొత్తగా నియమితులైన వారు హైకోర్టు విభజన సందర్భంగా తెలంగాణను ఆప్షనల్‌గా ఎంచుకుంటే స్థానికులకు నష్టం జరుగుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితేనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చెప్పడం సరికాదన్నారు. ఆర్టికల్ 170 పేరుతో సీట్ల పెంపు విషయంలో దాటవేత ధోరణి అవలంబించడం సమంజసం కాదన్నారు. హైకోర్టు విభజన, సీట్ల పెంపు బిల్లులను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. -
సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రెండో కౌన్సెలింగ్ తరువాత కూడా దేశవ్యాప్తంగా మిగిలిపోయిన సుమారు 500 సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. వైద్యకోర్సుల్లో సీట్లు మిగిలిపోవడం మంచి పరిణామం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 48 సీట్లు కలుపుకొని దేశవ్యాప్తంగా మిగిలిన సుమారు 500 సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సెలింగ్ గడువును అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించాలని లేఖలో కోరారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో దేశ ప్రజల ఆరోగ్య సేవలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
తమ గ్రామం పేరు లేదని మంత్రి, ఎంపీ అడ్డగింత..
కరీంనగర్: తమ గ్రామం పేరును శిలాఫలకంపై పెట్టలేదంటూ గ్రామస్తులు మంత్రిని, ఎంపీని ఘెరావ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది. చొప్పదండి మండలం రేవెల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మినీట్యాంక్ బండ్ పనులను ప్రారంభించారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా వేసిన శిలాఫలకంలో తమ గ్రామం పేరు లేదంటూ దేశాయిపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులను ఘెరావ్ చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత శాంతించి వారికి దారిచ్చారు.