
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో నిబంధనలకు విలువ ఉండటం లేదని, ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈవెంట్ పర్మిషన్ల వ్యవహారంలో ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీంతో ప్రభుత్వం రూ.100 కోట్లు నష్టపోయిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయ నష్టంపై కాగ్ లేఖ రాసిందని పేర్కొన్నారు. ఈ లేఖ విషయంలో ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఈ లేఖను శాసనమండలిలో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన, పునరావాస చర్యలపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. పొంగులేటి మాట్లాడుతూ, ఈవెంట్ పర్మిషన్, ప్రివిలేజ్ ఫీజు విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చీప్ లిక్కర్, నకిలీ లిక్కర్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంలేదన్నారు. హైదరాబాద్‌లో నకిలీ మద్యం, విదేశీ మద్యం అమ్మకాలను నియంత్రించాలని కోరారు. హైదరాబాద్‌లోని టీజీఐఎఫ్ పబ్‌లో మైనర్లకు మద్యం విక్ర యించడం వల్ల చిన్నారి రమ్య మృతి చెందిందన్నారు.
ఆదాయం కాదు.. ఆరోగ్యం ముఖ్యం: రాంచందర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గుడుంబాను నియంత్రించినట్లు చెప్పుకుంటూ.. మరోవైపు చీప్ లిక్కర్ విక్రయాలను పెంచుతోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైన్ షాపుల సమయాన్ని పెంచడంతో కూలీలు, పేదలు ఎక్కువగా మద్యానికి బానిస అవుతున్నారని, ఏటీఎంల ముందు నిల్చున్నట్లుగా ఉదయమే వైన్‌షాపుల వద్ద బారులు తీరుతు న్నారన్నారు.
రాష్ట్రంలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించే విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గుడుంబా నిర్మూలన, పునరావాస చర్యలపై ప్రభుత్వం తరఫున బుధవారం సమాధానం ఇవ్వనున్నారు.