
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన బీసీ సంఘం ఇకపై రాజ్యాధికారమే ఏకైక ఎజెండాగా పని చేయనున్నట్లు బీసీ రాజకీయ సమితి (బీఆర్‌ఎస్) ప్రకటించింది. రాయితీల నుంచి రాజ్యాధికారం వైపు బీసీలు దృష్టి సారించాలని పిలుపునిచ్చింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ రాజకీయ యుద్ధభేరి జరిగింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ భేరీకి ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ భబన్‌రావు థైవాడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్‌రాజు, బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సినీ నటి రమ్యశ్రీ, సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బి.యాదగిరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, రచయితల సంఘం అధ్యక్షుడు శేఖర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుల్కచర్ల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు కె.శ్యాం కురుమ, పూలే కమిటీ చైర్మన్ గణేషాచారి తదితరులతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి ఐదు వేల మందికిపైగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బీసీ రాజకీయ సమితికి ఏ పార్టీలతో కూడా సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ అయితే బీసీకి టికెట్ ఇస్తుందో.. ఆయా అభ్యర్థులకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీసీ అభ్యర్థులు లేని చోట బీఆర్‌ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 30 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. యుద్ధభేరి వేదికగా 9 మంది అభ్యర్థుల పేర్లను కూడా బీఆర్‌ఎస్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీ ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్న బీసీ సంక్షేమ సంఘం... రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ రాజకీయ వేదికను ఏర్పాటు చేçసినట్లు ప్రకటించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి బీఆర్‌ఎస్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించనుందని తెలిపింది. విజన్ 2024 నాటికి పూర్తి రాజ్యాధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించింది.
ఖర్చుపై కమిటీ వేయాలి: జస్టిస్ ఈశ్వరయ్య
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు విలువలు, సేవ చేసే తత్వం ఉన్న అభ్యర్థుల కంటే బాగా ఖర్చు చేసే వారికే టికెట్లు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయా అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. సేవకులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు టికెట్లు ఇస్తే.. చట్టసభలకు ఎన్నికైన తర్వాత వారు ప్రజలకేం సేవ చేస్తారు. తెలంగాణలో ఒకటి, అర శాతం ఉన్న కులాలు 56 శాతం జనాభా ఉన్న కులాలను పాలిస్తున్నాయి. రాజ్యాధికారంలో వాటా దక్కాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాతే అన్యాయం: జాజుల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. పార్టీ పగ్గాలు, బీఫాంలను వారు తమ చేతిలో పెట్టుకుని గెలుపు గుర్రాలు, సిట్టింగ్‌ల పేరుతో టికెట్లు అమ్ముకుంటున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అలాంటి పార్టీకు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతాం. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు అదే ప్రతిపాదికన సీట్ల కేటాయింపు జరగాలి. లేదంటే ఆయా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయి.
బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే...
కొల్లాపూర్: మాచర్ల రామకృష్ణగౌడ్
నర్సాపూర్: సోమన్నగారి లక్ష్మక్క
సూర్యాపేట: రాపర్తి శ్రీనివాస్‌గౌడ్
నర్సంపేట్: మధన్‌కుమార్
దేవరకద్ర: రాచాల యుగేందర్ గౌడ్
సిరిసిల్ల: పరిశ హనుమాండ్లు
ఆలేరు: కాదూరి అచ్చయ్య
భువనగిరి: సోము రమేష్‌కురుమ
వరంగల్ తూర్పు: రవిశంకర్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment