బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్–టీడీపీ, టీఆర్‌ఎస్–ఎంఐఎం పొత్తులు ప్రమాదకరమని, వాటిని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అలాంటి అపవిత్ర పొత్తు లను ప్రజలు అçసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అంటున్నారని, అలాంటి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కర్ణాటక తరహా రాజకీయాలకు రాష్ట్రంలో తెరలేపుతున్నారని పేర్కొన్నారు.
తాడు అనుకున్న మజ్లిస్ ఉరితాడు కాబోతోందని, ఇన్నాళ్లు పాముకు పాలు పోసి పెంచారన్నారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరి పోసేందుకు టీడీపీ, సీపీఐ పోటీ పడుతున్నాయని, అవి నీతి కాంగ్రెస్‌ను అవి బతికించలేవన్నారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభిస్తారన్నారు. తర్వాత 15 రోజుల్లో కరీంనగర్‌లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందన్నారు. పారదర్శకత ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్నారు.
మొదటి విడతలో 50 సభలు
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొదటి విడతలో 50 సభలు నిర్వహిస్తామని, వాటిల్లో పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు పాల్గొంటారని లక్ష్మణ్ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన అనేకమంది నేతలు తమకు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలు ప్రజలకు నేరుగా అందుతాయని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదన్నారు.
ఆయష్మాన్ భారత్ ఫథకంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు భాగస్వామి కాలేదో చెప్పాలన్నారు. అమిత్ షా పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించనుందని పేర్కొన్నారు. ఓటరు నమోదుకు అవసరమైతే మరింత గడువు పెంచాలని, అది పూర్తి అయ్యాకే ఎన్నికల షెడ్యూల్డ్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. టీఆర్‌ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించి, బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌తో ఫిక్సింగ్ కావాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమకు ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌తోనేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment