సాక్షి ప్రతినిధి, కడప : ప్రజల కోసం...ప్రాంతం కోసం...పదవీ త్యాగం చేసినవారు ఒకరైతే.., అధికారం కోసం పార్టీ ఫిరాయించి, ఆదరించిన వారినే దూషిస్తూ, అనూహ్యంగా అమాత్య పదవి దక్కించుకున్న వారు మరొకరు. ఆ ఇద్దరే కడప గడ్డపై లోక్‌సభ అభ్యర్థులుగా ఈసారి తలపడుతున్నారు. ప్రజల పక్షానే నిరంతరం నిలుస్తూ సేవే పరమావధిగా భావిస్తూ ఒకరు జోరుగా ప్రచారంలో దూసుకుపోతుండగా .. ఎత్తులు, పైఎత్తులు వేస్తూ, కుయుక్తులు పన్నుతూ అవకాశవాద రాజకీయాలకు చిరునామాగా నిలిచే మరొకరు ప్రజల ముందుకు వస్తున్నారు. పరస్పర విరుద్ధ భావాలున్న ఇద్దరు అభ్యర్థుల నడుమ కడప ఎంపీ పోరు నడుస్తోంది.
కడప లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి పోటీలో ఉన్నారు. 2014లో కడప ఎంపీగా ఈయనే ఎన్నికయ్యారు. తనపై విశ్వాసంతో పట్టం కట్టిన ప్రజలకు వెన్నుదన్నుగా నిరంతరం నిలవడం ఆయనకున్న అనుకూలాంశం. విశాల హితంతో ప్రత్యేక హోదా మనకు సంజీవనిగా భావించి ఎంపీగా పార్లమెంట్‌లో పోరాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాలని చట్టసభలో నినదించారు.
పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టానికే విలువ లేకపోతే చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతుందని విరుచుకు పడ్డారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని, ప్రత్యేకహోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఉద్యమంలో బలంగా నిలిచారు. తుదకు ఎంపీ పదవిని ఇందుకోసం తృణప్రాయంగా వదులుకున్నారు. కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
ప్రజల కంటే పదవులు ముఖ్యం కాదని రుజువు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పదవీ త్యాగం చేసిన ఆ ఇద్దరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ఈసారి కూడా ఎంపీ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులుగా మంత్రి ఆదినారాయణరెడ్డి, డీఏ సత్యప్రభ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ పార్లమెంటు బరిలో తొలిసారిగా నిలిచారు.
అవకాశవాదిగా ముద్రవేసుకున్న ఆది...
జమ్మలమడుగు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. అధికారం కోసం అనైతిక చర్యలకు పాల్పడ్డారు. తనను ఆదిరించి అక్కున చేర్చుకున్న పార్టీని, వైఎస్ కుటుంబాన్ని దూషిస్తూ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ, సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఆపై టీడీపీ నేతల్ని కాదని ..ఫిరాయించిన ఎమ్మెల్యేగా అనూహ్యంగా మంత్రి పదవిని చేజెక్కించుకున్నారు.
నడిమంత్రపు సిరిలా మంత్రి హోదా దక్కడంతో ఆదినారాయణరెడ్డి విచ్చలవిడిగా వైఎస్‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో తనంత తెలివితేటలు ఉన్న నాయకుడు లేరన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తుంటారు. ఈనేపథ్యంలో కడప పార్లమెంటు గడపలో అనేక కుయుక్తులు పన్నుతూ రాజకీయ సారథ్యం చేస్తున్నారు.
జమ్మలమడుగులో చేజారుతున్న ఆశలు....
వైఎస్సార్‌సీపీని కట్టడి చేస్తామని, ఎంపీకి గణనీయంగా మెజార్టీ తగ్గిస్తామని ఆదినారాయణరెడ్డి తమ అధినేత చంద్రబాబు ఎదుట గట్టిగా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ మాట నిలుపుకుంటే టీడీపీలో తనకు భవిష్యత్ ఉంటుందనే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడలను వేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ తగ్గించి, జమ్మలమడుగులో టీడీపీ మెజార్టీ పెంచుకోవాలనే దిశగా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
అందులో భాగంగా ‘టార్గెట్ పులివెందుల’ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్ని రంగప్రవేశం చేయించి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరున్న వైఎస్ అవినాష్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ముందు టీడీపీ అభ్యర్థి పాచికలు పారవని స్థానికులంటున్నారు. టీడీపీకి అండగా నిలుస్తుందనుకున్న జమ్మలమడుగులోనే ఈసారి ప్రజావ్యతిరేకత బహిర్గతం కానుందని ఎన్నికల విశ్లేషకుల అంచనా.
జమ్మలమడుగు చరిత్రలో మునుపెన్నడూ ఏ ఒక్క నాయకుడి సమావేశానికి రానంతగా ప్రజలు శుక్రవారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశానికి హాజరైయ్యారు. టీడీపీకి అండగా నిలుస్తోందని భావించిన జమ్మలమడుగులోనే ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ ఎన్నికల సభ చెప్పకనే చెప్పింది. తక్కిన 6 నియోజకవర్గాలల్లో ఏ ఒక్క చోట కూడా అధికార పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది.
పులివెందుల, కడప, మైదుకూరు, బద్వేల్, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాలల్లో ఎంపీ పదవీ త్యాగం చేసిన వైఎస్ అవినాష్‌రెడ్డి ఎదుట అవకాశవాదిగా ముద్రపడ్డ ఆదినారాయణరెడ్డి ఎత్తులు పారడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం ఓటర్లు : 15,68,388
పురుషులు : 7,72,685
మహిళలు : 7,95,469
ఇతరులు : 234
Comments
Please login to add a commentAdd a comment