సాక్షి ప్రతినిధి, కడప: ఓవైపు ఖనిజ వనరులతో అలరారుతూ... మరోవైపు భిన్నమైన పంటలకు నెలవైన కడప లోక్ సభ నియోజకవర్గం రాజకీయంగానూ అంతే ప్రఖ్యాతిగాంచింది. ఒకనాడు కమ్యూనిస్టుల కోటగా ఉన్నా... డా.వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మహా నేతల హయాంలో కాంగ్రెస్ విజయాలకు మారుపేరుగా నిలిచినా... వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి వెన్నుదన్నుగా మారింది.
ఎద్దుల ఈశ్వరరెడ్డి, కందుల ఓబుళరెడ్డి, డిఎన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి తదితర మహామహులు ఎంపికైన గడ్డపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి లాంటి నవతరం నాయకుల శకం ఆరంభమైంది. కడప పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగితే సీపీఐ నాలుగు సార్లు, టీడీపీ ఒక్కసారి, కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, వైఎస్సార్‌సీపీ రెండుసార్లు విజయం సాధించాయి. 2011 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు 5,45,672 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.
దివంగత సీఎం వైఎస్సార్, వైఎస్ జగన్‌కు ఉన్న అపార ప్రజా మద్దతు కారణంగా ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. నిత్యం ప్రజల్లో మెలుగుతూ, ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తూ, పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం త్యాగం చేసిన తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి ప్రజల ముంగిట నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. అవకాశవాద రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందిన ఆయన ఎంపీ బరిలో తొలిసారి పోటీ చేస్తున్నారు.
ఘన చరిత్ర
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొదటి ఎన్నికల్లో ఎద్దుల ఈశ్వరరెడ్డి (సీపీఐ)... పెంచికల బసిరెడ్డి (కాంగ్రెస్)ని ఓడించారు. అయితే, తర్వాతి ఎన్నికల్లో ఈశ్వరరెడ్డిపై ఊటుకూరు రామిరెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. అనంతరం ఈశ్వరరెడ్డి సీపీఐ తరఫున హ్యాట్రిక్ కొట్టారు. 1977లో మరోసారి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ చేతికి చిక్కింది. 1984లో మినహా 2009 వరకు వరుసగా ఆ పార్టీనే విజయం వరించింది. మొత్తం 17 సార్లు ఎన్నికలు నిర్వహిస్తే 9 సార్లు వైఎస్ కుటుంబ సభ్యులు గెలుపొందారు.
దివంగత ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తొలినాళ్లలో ఉన్న సానుకూలతతో 1984లో ఆ పార్టీ అభ్యర్థి డీఎన్ రెడ్డి నెగ్గారు. ఇక దివంగత మహా నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగి 1,66,752 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ఏకంగా 4,22,790 ఓట్ల మెజార్టీ కొల్లగొట్టారు. 2004లో రెండోసారి ఎంపీగా పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి 1,29,744 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. 2009లో తొలిసారి పోటీ చేసిన వైఎస్ జగన్ 1,78,846 ఓట్ల మెజార్టీ, 2014లో మొదటిసారి బరిలో దిగిన వైఎస్ అవినాష్‌రెడ్డికి 1,90,323 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఎవరికెలా?
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వైఎస్ కుటుంబానికి అపార ప్రజా మద్దతు ఉంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తారనే నమ్మకమే ఇందుకు కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తోడ్పాటుతో ఆయన సోదరుడు, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి ఎనిమిదేళ్లుగా ప్రత్యక్షంగా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీగా తమ ప్రాంత అవసరాలపై పార్లమెంటులో గళమెత్తారు. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పదవీ త్యాగం సైతం చేశారు. ఈ పరిణామం మరింత లాభించే అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ నవతరం నేతగా గుర్తింపు పొందారు.
నియోజకవర్గ ప్రత్యేకతలు
- సిమెంటు ఉత్పత్తి తగిన ముడి ఖనిజం ఉన్న ప్రాంతం. ప్రస్తుతం ఐదు సిమెంటు పరిశ్రమలున్నాయి.
- నియోజకవర్గంలో అరటి, వరి, చీనీ, బొప్పాయి, వేరుశనగ, ప్రధాన పంటలు. అరుదైనా కేపీ ఉల్లి సైతం పండిస్తున్నారు.
- రాతినార, డోలమైట్, యురేనియం, ముగ్గురాయి, నాపరాయి, ఐరన్ ఓర్ లాంటి ఖనిజాలకు నిలయం.
- మత సామరస్యానికి ప్రతీకైన పెద్ద దర్గా (అమీన్‌పీర్ దర్గా), దేవుని కడప, సెయింట్ కేథడ్రల్ చర్చి ఇక్కడే కొలువై ఉన్నాయి.
- కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి బ్రహ్మంగారి మఠం (బి.మఠం)లో ఉంది.
‘ఆది’... అవకాశవాది
టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి అవకాశవాదిగా ముద్రపడింది. ‘వైఎస్’ అండతో ఎదిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆది... 2004, 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, అధికారం కోసం తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. మంత్రి పదవి దక్కాక తనకు ఎదురే లేదన్నట్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా నిలిచారు. ఆయనకు జమ్మలమడుగు మినహా తక్కిన అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ. పైగా టీడీపీ 1989 నుంచి కడపలో గెలవలేదు. మళ్లీ ఇదే ఫలితం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గుండ్లకుంట శ్రీ రాములు అభ్యర్థిగా ఉన్నా ఆయన పోటీ నామమాత్రమే.
అసెంబ్లీ సెగ్మెంట్లు
1. పులివెందుల 2.జమ్మలమడుగు
3.ప్రొద్దుటూరు 4.కమలాపురం 5.కడప 6.మైదుకూరు 7. బద్వేల్
తొలి ఎంపీ : ఎద్దుల ఈశ్వరరెడ్డి
ప్రస్తుత తాజా మాజీ ఎంపీ: వైఎస్ అవినాష్‌రెడ్డి
ప్రస్తుత రిజర్వేషన్: జనరల్
ఎవరెన్నిసార్లు:
కాంగ్రెస్ –10 సిపిఐ –4
టీడీపీ –1 వైఎస్సార్‌సీపీ–2
–మోపూరి బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడప
Comments
Please login to add a commentAdd a comment