
రఘువీరారెడ్డికి చెందిన కళ్యాణదుర్గ్ భవన్
సాక్షి, కళ్యాణదుర్గం : ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు సెంటిమెంట్‌లు చాలా కామన్. నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం వరకూ ఒక్కొక్కరూ ఒక్కో సెంటిమెంట్‌ను నమ్మడం చూస్తుంటాం. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి మాత్రం వాస్తు సెంటిమెంట్ ఉంది. తాను మంత్రిగా ఉన్న సమయం లో కళ్యాణదుర్గంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించుకున్న సొంత భవనం (కళ్యాణదుర్గ్ భవనం) ఆయనకు అచ్చిరాలేదంట. అందుకే ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఆయన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
పార్వతి నగర్‌లో అద్దెకు తీసుకున్న భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
ఆ ఇంటి వాస్తే కారణమట!
2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘువీరారెడ్డి మంత్రి పదవులు కూడా చేపట్టారు. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెద్ద భవంతిని నిర్మించారు. మహా నేత వైఎస్సార్ అకాల మరణం అనంతరం.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడగా ఆ సమయంలో జరిగిన పోరాటాలతో మంత్రిగా ఉన్న రఘువీరా ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పెనుకొండకు మకాం మార్చారు. అక్కడ ఘోరంగా ఓడి పోయారు.
పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్న ఆయన.. రాష్ట్రంలో ము ఖ్యమైన నేతలనూ కాపాడుకోలేకపోయారు. కేవలం వాస్తు సరిగాలేని ఇంట్లో ఉండటం వల్లే ఇవన్నీ జరిగాయని ఆయన భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు చుట్టపు చూపుగా కళ్యాణదుర్గం వచ్చి వెళ్లిన ఆయన... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. కళ్యాణదుర్గం భవనానికి వాస్తు సరిగా లేదని పార్వతి నగర్‌లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. అక్కడినుంచే ఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు.