
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి ఝలక్ ఇచ్చారు. ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబు చేపట్టేబోయే నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఈసీ వద్ద ప్రతిపక్షాలు ఈ రోజు చేపట్టబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని తొలుత భావించిన కుమారస్వామి.. ఎగ్జిట్ పోల్స్‌తో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
కాగా, కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో సోమవారం ఢిల్లీలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు.