
లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 29న స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పుంజుకుంది.
సాక్షి బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 29న స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పుంజుకుంది. సార్వత్రిక సమరంలో విజయఢంకా మోగించిన బీజేపీ రెండోస్థానానికి పడిపోయింది. జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసి మూడోస్థానంతో సరిపెట్టుకుంది. నగర, పురసభల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలువగా.. పట్టణ పంచాయతీల్లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఫలితాలు విడుదలైన 1,221 వార్డులకు కాంగ్రెస్ 509, బీజేపీ 366, జేడీఎస్ 174, బీఎస్పీ 3, సీపీఐ (ఎం) 2, ఇతరులు 7, స్వతంత్రులు 160 వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం 63 స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేశారు. బెంగళూరు రూరల్, శివమొగ్గ స్థానాలకు ఈనెల 3న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 61 స్థానిక సంస్థల్లోని మొత్తం 1,326 వార్డులకు 30 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 1,296 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. కొన్ని వార్డుల్లో ఎన్నిక రద్దు కావడంతో రీపోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం 1,221 వార్డులకే ఫలితాలు వచ్చాయి.
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 42 శాతం దక్కించుకుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యాలతో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ఆ పార్టీ వెనుబడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. (చదవండి: మోదీ మంత్రం.. కాషాయ విజయం)