
రాజ్‌నాథ్‌కు వ్యవసాయశాఖ.. గంభీర్‌కు క్రీడా శాఖ
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు ఎవరా? అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు ప్రచారం జరుగుతుండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పటివరకు ఎలాంటి జాబితా రూపొందించలేదని, పుకార్లను ప్రచారం చేయవద్దని తమ పార్టీ ఎంపీలను గత శనివారం హెచ్చరించారు. ఈ విషయమై మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అమిత్ షా, మోదీలు బుధవారం మరోసారి భేటీ అయ్యారు. కేబినెట్ జాబితాపై సుమారు 4 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఇక అనారోగ్య కారణాలతో గత కేబినెట్‌లోని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు స్వచ్చందంగా రేసు నుంచి తప్పుకోగా.. వారి స్థానాల్లో ఆర్థికమంత్రిగా జయంత్ సిన్హా, విదేశాంగ శాఖ స్మృతి ఇరానీలకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా కూడా ఈ సారి కేబినేట్‌లోకి రాబోతున్నారని, ఆయన హోంశాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. హోంశాఖ అమిత్‌షాకు దక్కితే రాజ్‌నాథ్ సింగ్‌కు వ్యవసాయశాఖ కేటాయించనున్నట్లు సమాచారం. రక్షణ మంత్రిగా రాజీవ్ ప్రతాప్ రూడీ, రైల్వే మంత్రిగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్‌కు మానవ వనరుల మంత్రిత్వశాఖ దక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా కోడైకూస్తోంది. రవాణ శాఖ మంత్రిగా మరోసారి నితిన్ గడ్కరీనే కొనసాగుతారని, కిరణ్ రిజిజుకు పెట్రోలియం శాఖతో ప్రమోషన్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్‌కు కేంద్రమంత్రి పదవి వరించనుందని, మరోసారి ఆరోగ్యశాఖ మంత్రిగా జేపీ నడ్డానే కొనసాగుతారని తెలుస్తోంది. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి తూర్పు ఢిల్లీ నుంచి నెగ్గిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు క్రీడాశాఖ వరించనుందని, వాణిజ్యశాఖ మంత్రిగా మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీకి అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఏ కూటమిలో భాగమైన అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రన్ కేంద్రమంత్రి రేసులో ఉన్నారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ రెండు కేంద్రమంత్రి పదవులు అడుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రలకు కేబినేట్‌లో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది.