సాక్షి, హైదరాబాద్: పుర‘పోరు’మంత్రులకు అగ్నిపరీక్షగా మారింది. మున్సిపోల్స్‌లో ఓడితే మంత్రి పదవి పోతుందనే ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక అమాత్యులను కలవరపరుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల మధ్య సమన్వయం కుదరకపోవడం, సముదాయించేందుకు ప్రయత్నించినా స్థానిక నేతలు వారి మాట పెడచెవిన పెట్టడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన టీఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కార్మిక మంత్రి మల్లారెడ్డితో మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితతో మాజీ ఎమ్మెల్యే తీగల.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి పొసగకపోవడంతో వీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దళానికి తిరుగుబాటు బెడద తొలగిపోలేదు. ఎవరికి వారే పట్టువీడకపోవడంతో రాజధాని శివార్లలో మున్సిపోల్స్ ఆసక్తికరంగా మారాయి.
కుదరని సమన్వయం..
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఫీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ నగర పాలక సంస్థల్లో టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు స్థానిక నాయకులను వర్గాలుగా చీల్చేసింది. టికెట్ల కేటాయింపులో ఇద్దరూ వేదిక మీదే కీచులాడుకునే స్థాయికి వెళ్లడంతో సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై రెండు సార్లు మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఎమ్మెల్యేలకే బీఫారాలు ఇచ్చే బాధ్యతలు అప్పగించడంతో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి తనకు అనుకూలంగా ఉన్న వారికే బీ ఫారాలు ఇచ్చారని సుధీర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ వర్గానికి అన్యాయం జరిగిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ కొందరు రెబెల్స్‌గా దిగగా.. మరికొందరు వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇదే సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట పురపాలికల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక, మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్‌పేట, మీర్ పేట కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపికలో మంత్రి సబిత, మాజీ ఎమ్మె ల్యే తీగల కృష్ణారెడ్డిల మధ్య కూడా సమన్వయం కుదరలేదు. ఇరువర్గాలు పోటాపోటీగా టికెట్లు ఆశించడం, స్థానిక ఎమ్మెల్యేగా సబిత తన వర్గానికి పెద్దపీట వేయడంతో తీగల వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. వారిలో కొందరు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పినా పట్టించుకోకుండా తిరుగుబావుటా ఎగురవేశారు.
తాండూరు అసెంబ్లీ కూడా అధికార పార్టీకి తలనొప్పిగానే మారింది. ఇక్కడ ఉన్న తాండూరు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు విషయంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి చుక్కెదురైంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ తన మార్కును చూపించడంతో మహేందర్ శిబిరానికి నిరాశే మిగిలింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు మంత్రి తలసాని రంగంలోకి దిగినా ఫలితం అంతంతగానే ఉంది. దీంతో ఇక్కడా టీఆర్‌ఎస్‌కు రె‘బెల్స్’మోగుతున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు, ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రులకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.
22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు..
పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్ పుర రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మంత్రులుగా ఉమ్మడి జిల్లాకు బాధ్యత వహించాల్సిన సబిత, మల్లారెడ్డిలు తమ వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రంజుగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే 22 పుర, 7 నగర పాలక సంస్థలకు బాధ్యత వహించాల్సిన అమాత్యులు తమ సెగ్మెంట్లలోని ఇంటిపోరునే పరిష్కరించుకోలేకపోవడం గమనార్హం. ఇక, మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా సమస్య వచ్చిన దగ్గర మంత్రుల మార్కు కూడా కనపడలేదు. నియోజకవర్గాలకే పరిమితమై మంత్రులు రాజకీయం చేయడంతో రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న రంగారెడ్డి జిల్లా అధికార పార్టీకి సవాల్‌గానే మారింది.
Comments
Please login to add a commentAdd a comment