సాక్షి వెబ్, హైదరాబాద్ : ‘ప్రజాస్వామ్య దేశంలో సంపూర్ణమైన పరిణతి ఉంటే పార్టీలు, అభ్యర్థులు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికలు వస్తే ఆగం కావాల్సిన అవసరం లేదు. ఆలోచించి ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది’ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలివి. ప్రతి ప్రచార సభలోనూ ఆయన ఈ మాటలు చెప్పారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి కేసీఆర్ ప్రసంగించారు. పదునైన, పరుష పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఉద్యమనేత దీనికి పూర్తి భిన్నంగా ఎన్నికల ప్రచారం సాగించారు. తమ అభివృద్ధి గురించి సాధికారికంగా వివరిస్తూనే, ఆలోంచి ఓటు వేయాలని ఓటర్లకు ఉద్బోధించారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వకుండానే ప్రజలను ఆకట్టునే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా ప్రజల కళ్లముందు ఉందని చెబుతూనే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని నిర్మోహమాటంగా ఒప్పుకున్నారు. ముందుస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సివచ్చిందో ప్రజలకు వివరించగలిగారు. (అందుకే ముందస్తు ఎన్నికలు: కేసీఆర్)
నేను చెప్పేది నిజామా, కాదా?
తాము చెప్పివన్నీ చేయలేకపోయామని, కొత్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల సమయంతా ప్రణాళికలకే సరిపోయిందని చెప్పుకొచ్చారు. హామీయిచ్చినన్ని డబుల్ ఇళ్లు కట్టలేకపోయామని, మెల్లగా కడతామని ప్రజలను కన్విన్స్ చేశారు. ఆలస్యమైనా ప్రజలకు మంచి ఇళ్లు కట్టివ్వాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎవరికి ఓటు వేయాలనే దానిపై గందరగోళం అవసరం లేదని, నాలుగున్నరేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని ప్రతి సభలోనూ వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ మళ్లీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీయిచ్చారు. తాను చెప్పేది నిజమా, కాదా అనేది ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. తాను చెప్పేది నిజమని నమ్మితే తమ అభ్యర్థులను లక్ష ఓట్ల మెజారిటీ తగ్గకుండా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తాము మళ్లీ అధికారంలోకి రాకుంటే తమకంటే ప్రజలకే ఎక్కువ నష్టమని కాస్త భయపెట్టే ప్రయత్నం కూడా చేశారాయన. ప్రజల అభీష్టం గెలిస్తే, ప్రజల అజెండా అమలవుతుందని ఓటర్లలో చైతన్యం కలిగించారు. ఓటు అనగానే గాలి గాలి గత్తర కావొద్దని, దాచి దాచి దెయ్యాల పాల్జేయొద్దని తనదైన శైలిలో ముక్తాయించారు. మీరంతా నా వెంట ఉంటే అద్భుతాలు చేసి చూపిస్తానంటూ ఊరించారు.
మాకు అందరూ సమానమే
తెలంగాణలో నివసిస్తున్న ప్రజలందరినీ సమానంగా చూస్తామని, ఎటువంటి వివక్ష లేదని స్పష్టం చేయడం ద్వారా సెటిలర్ల మనసుల్లో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించారు. గత నాలుగున్నరేళ్లుగా ఎటువంటి వివక్ష చూపలేదని గుర్తు చేశారు. ‘మా ప్రభుత్వంలో ఆంధ్ర, తెలంగాణ వివక్ష లేదు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా ఆనందంగా ఉన్నారు. ఇక్కడున్నవారంతా తెలంగాణ బిడ్డలుగా ఉండండి. కేసీఆర్ మీ వెంట ఉంటడు. అందరం మంచిగ బతకాలి’ అంటూ ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. చిల్లర రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని చాటి చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందినవారు శాంతియుతంగా నివసిస్తున్నారని ప్రకటించారు. ఎటువంటి పరుష పదజాలం వాడకుండా సూటిగా విషయాన్ని ఓటర్లకు అర్థమయ్యేలా వివరించారు.
హుందాగా తిప్పికొట్టారు
ప్రత్యర్థుల ఆరోపణలను కూడా కేసీఆర్ హుందాగా తిప్పికొట్టారు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప ఆయన సంయమనం కోల్పోదు. బీజేపీ ఏజెంట్ అంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. తాను ఎవరి ఏజెంట్‌ను కాదని, ప్రజల ఏజెంట్‌నని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పార్టీకి బీటీమ్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా తనదైన శైలిలోనే గులాబీ నేత తిప్పికొట్టారు. తనను ఎదుర్కొలేక ప్రతిపక్షాలు కూటమి కట్టాయని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవ నినాదాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో గట్టిగానే వినిపించారు. తాను బతికున్నంతకాలం తెలంగాణను బానిస కానివ్వబోనని శపథం చేశారు. డంబాచారాలు, డబ్బాలు కొట్టువాల్సిన అవసరం తమకు లేదంటూ ఈసడించారు. ప్రతిపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సభలోనూ ప్రసంగం ముగిసిన తర్వాత తప్పనిసరిగా తెలుగులో ధన్యవాదాలు చెప్పారు కేసీఆర్. తన మాట తీరుతో సాహోరే కేసీఆర్ అనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment