కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొందరు సొంత ప్రయోజనాలు, స్వార్థం కోసం తమ లాంటి యువకులను, తెలంగాణ కోసం కొట్లాడిన వారిని బలిచేస్తున్నారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తనను చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో ఒకటి చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే వారితో షోకాజ్ నోటీసులు పంపుతారా? అని నిలదీశారు. ‘పార్టీలో పోస్టులు అమ్ముకుంటారు. కమిటీలు వేసేందుకు డబ్బులు తీసుకుంటారు. టికెట్లు అమ్ముకుంటారు. పక్క పార్టీలతో కుమ్మక్కవుతారు. అలాంటి వాళ్లా నాకు షోకాజ్ నోటీసులిచ్చేది’అని ప్రశ్నించారు.
కార్యకర్తల మనోభావాలు ఏమిటో తెలియని వారు నాకు నోటీసులిస్తారా? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని గుర్తించకుండా రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలంటారా? అని ప్రశ్నలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియాతోపాటు పార్టీ కమిటీలపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపిన నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేసేందుకుగల కారణాలను వివరించారు.
కేసీఆర్‌ను తిడితేనే పదవులా?
పార్టీలో అంతర్గతంగా మాట్లాడి సూచనలు చేస్తే పట్టించుకోరని, బలంగా ఏదైనా చెబితే పక్కనపెడతారని, అందుకనే బహిరంగంగా మట్లాడాల్సి వచ్చిందని రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం ఆవేదనతో కూడినవేనని చెప్పారు. తన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందో లేదో పార్టీ సీనియర్లు గుండెలపై చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీకి సేవ చేస్తామని, తమ లాంటి యువ నాయకులను, కేసీఆర్‌పై గట్టిగా కొట్లాడుతున్న వారిని ముందు పెట్టాలని అడిగడం తప్పేనా? అని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు తమను బలంగా కోరుకుటంన్నారని, అది మరచిపోయి అనర్హులు, పార్టీ మారిన వారు, జైళ్లకు పోయిన వారిని కమిటీల్లో నియమించారని దుయ్యబట్టారు.
కమిటీలో కేవలం 25 శాతం మందే అర్హులున్నారని, మిగతా వారంతా అనర్హులేనన్నారు. బూతు పురాణం మాట్లాడితే, కేసీఆర్‌ను తిడితేనా పదవులు ఇస్తారా? అని అడిగారు. రాష్ట్రంలో బలంగా టీఆర్‌ఎస్ వ్యతిరేక వపనాలు వీస్తున్నాయని, ఈ సమయంలో సత్తా ఉన్న నేతలను ముందుపెట్టాలని కోరారు. ‘మీరే ముఖ్యమంత్రులు, మంత్రులు అవ్వండి. మాకెలాంటి పదవులు వద్దు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. కానీ మాలాంటి యువకులను ప్రోత్సహించండి. మా సేవలు వాడుకోండి. మంచి వాళ్లకు టికెట్లివ్వండి’అని రాజగోపాల్‌రెడ్డి సూచించారు.
పార్టీ నిద్రపోతోంది...
కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందని, అయితే పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లోనూ సమన్వయం లేకనే పార్టీ ఓడిందన్నారు. పార్టీలో అందరూ ముఖ్యమంత్రి, మంత్రులు కావాలని కోరుకుంటున్న వారు తప్పితే కష్టపడ్డ వారిని ప్రోత్సహించే ఆలోచన ఎవరిలోనూ లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కె.ఆర్. సురేశ్‌రెడ్డి పేరు పార్టీ కమిటీల్లో ఉందంటేనే పార్టీ నిద్రపోతోందని అర్థమవుతోందని, కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారని, కమిటీలు ఇష్టారీతిగా నియమించారని ఆరోపించారు. ఎన్నికల కమిటీలో 41 మంది ఏమిటని, అంత మంది ఉంటే వారు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా కమిటీని 9 మందికి కుదించాలన్నారు. ఎన్నికల హామీలన్నీ ఉత్తమ్ చెప్పేశాక మేనిఫెస్టో కమిటీ ఎందుకని ప్రశ్నించారు. రూ. 2 లక్షల చొప్పున రుణ మాఫీ, అందరికీ సన్న బియ్యం, ఉద్యోగాలు, పింఛన్లు పెంపు తదితర హామీలను ప్రకటించాక మెనిఫెస్టో కమిటీ ఏం చేస్తుందన్నారు.
వ్యతిరేక శక్తులను ఉత్తమ్ తయారు చేశారు ...
పార్టీ నుంచి తనను బయటకు పంపే ఆలోచన రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియాకుగానీ, అధిష్టానానికి కానీ లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులే బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తనను పార్టీ నుంచి బయటకు పంపే దమ్ము, ధైర్యం స్వార్ధపరులకు లేదన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో తనకు వ్యతిరేక శక్తులుగా కొందరిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తయారు చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల మనోభావాలు చెబితే బయటకు పంపి మీ కళ్లను మీరే పొడుచుకుంటారా..? అని ప్రశ్నించారు. తనలాంటి వారిని బయటకు పంపితే పార్టీకే నష్టమన్నారు. సీనియర్ నేతలను సమన్వయం చేయడంలో కుంతియా విఫలమవుతున్నారని, తనలాంటి యువకుల సూచనలు వినకుండా ఉత్తమ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శించారు. దీనిపై హైకమాండ్ ఆలోచించాలన్నారు.
పార్టీలో కోవర్టులున్నారు...
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని రాజగోపాల్‌రెడ్డి మరో బాంబు పేల్చారు. ఎదుటి పార్టీ అభ్యర్థిపై బలహీన వ్యక్తలను రంగంలోకి దింపే ప్రయత్నాలను కోవర్టులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గత ఎన్నికల్లో పార్టీని ఓడించారని, ఇప్పుడూ అదే చేయబోతున్నారన్నారు. తాను పార్టీ మారబోతున్నానన్నది ప్రచారమేనని, తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా మరో మూడేళ్ల పదవి ఉందని, అయితే పార్టీ పోటీ చేయమంటేనే మునుగోడు నుంచి చేస్తానని లేదంటే చేయనన్నారు. తనకు అందిన షోకాజ్ నోటీసుపై లేఖ రూపంలో వివరణ ఇస్తానని, దానిపై పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment