సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా గురించి గతంలో బహిరంగంగా మాట్లాడి తప్పు చేశానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచన, ఆవేదనలే తనను అలా మాట్లాడించాయని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే చెప్పానని, అయినా తాను చేసింది తప్పేనని అంగీకరించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలన్న కుంతియా సూచన సరైందేనని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి సంబంధం లేదన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులోనే జైలుకు వెళ్లారని, ఇప్పుడు జైలుకు వెళ్తే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతాననే ఆలోచనతో జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు వారు అభిమానించే వారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలనుకోవడంలో తప్పులేదని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని కోరారు. బలమైన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment