బీసీల హవా.. అసెంబ్లీలో 27 సీట్లు! | Kommineni Srinivasa Rao Social analysis on 1978 elections | Sakshi
Sakshi News home page

బీసీల హవా

Published Sun, Nov 25 2018 5:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kommineni Srinivasa Rao Social analysis on 1978 elections - Sakshi

దేశ చరిత్రలో 1978 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రాముఖ్యత ఉంది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిర ఓడిపోయాక జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆమెకు ఎంతో కీలకంగా మారాయి. ఇక్కడ విజయం సాధించడం ద్వారా తిరిగి ఆమె దేశ ప్రధాని పగ్గాలను మళ్లీ అందుకోవడానికి మార్గం పడినట్లయింది. కాంగ్రెస్‌లో మరో చీలిక సంభవించి ఇందిరాగాంధీ తన పేరు మీదే పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ ఐ గా ఆ పార్టీ గుర్తింపు పొందింది. ఆ రోజులలో ప్రచార సాధనాలు లేకపోయినా ఇందిరాగాంధీకి జనం బ్రహ్మరథం పట్టారు. అప్పటికి ఇందిరతో విభేదించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభృతులు కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్న కాంగ్రెస్‌ ఆర్‌ లో ఉండిపోయారు. చెన్నారెడ్డి, అంజయ్య, వెంకటస్వామి తదితరులు కాంగ్రెస్‌ ఐ లో చేరిపోయారు. చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి పార్టీని నడిపించారు. కాంగ్రెస్‌ ఐ కొత్త పార్టీగా ఉన్నప్పటికీ ప్రజలు దానికి పట్టం కట్టారు. పెద్ద ప్రభంజనమే వీచింది.

కాంగ్రెస్‌ ఐకి ఉమ్మడి రాష్ట్రంలో 180 సీట్ల వరకు వస్తే తెలంగాణలో 65 సీట్ల లభించాయి. జనతా పార్టీకి ఉమ్మడి ఏపీలో 60 సీట్లు  వస్తే తెలంగాణలో 15 వచ్చాయి. కాంగ్రెస్‌–ఆర్‌కు ఉమ్మడి ఏపీలో 30 సీట్లు, తెలంగాణలో 12 వచ్చాయి. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే తెలంగాణలో రెడ్లు 34 మంది వివిధ పార్టీల పక్షాన గెలిచారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి 16 మంది, జనతా నుంచి ఏడుగురు, కాంగ్రెస్‌ ఆర్‌ నుంచి ఐదుగురు గెలిచారు. బీసీలు అత్యధికంగా 27 మంది విజయం సాధించారు. వారిలో 20 కాంగ్రెస్‌–ఐ పక్షాన గెలిచారు. ఎస్సీలు 16 మందికి గాను 14 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. అంటే రెడ్డి, తదితర అగ్రవర్ణాల కన్నా బీసీ, ఎస్సీ వర్గాలు అధికంగా కాంగ్రెస్‌–ఐ కి మద్దతు ఇచ్చాయి. బీసీలు, ఎస్సీలు కలిసి కాంగ్రెస్‌–ఐ తరపున 34 మంది విజయం సాధించారు. బ్రాహ్మణులు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినా, క్రమేపీ తగ్గుతూ ఈసారి మూడు సీట్లే దక్కించుకున్నారు. కమ్మ వర్గం వారు ఐదు సీట్లు గెలుచుకున్నారు. వెలమ వర్గం వారు ఏడు స్థానాలు, ముస్లింలు ఏడు చోట్ల నెగ్గారు. 
తగ్గిన రెడ్ల సంఖ్య 
అధికారానికి వచ్చిన పార్టీ నుంచి తక్కువ మంది రెడ్లు ఎన్నికవడం ఈసారి ప్రత్యేకతగా కనిపిస్తుంది. గతంలో అధికార కాంగ్రెస్‌ నుంచి పాతికపైనే రెడ్డి నేతలు ఎన్నిక అయ్యేవారు. కాని ఈసారి వారి సంఖ్య 17 గానే ఉంది. జనతా పార్టీ నుంచి7, కాంగ్రెస్‌–ఆర్‌ నుంచి 4, ఇండిపెండెంట్లు 4, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు గెలుపొందారు. గెలుపొందిన ప్రముఖులలో మర్రి చెన్నారెడ్డి, ఎం.బాగారెడ్డి, పి.జనార్దనరెడ్డి , నాయిని నరసింహారెడ్డి ప్రభృతులు ఉన్నారు. అప్పటికే మంత్రిగా ఉన్న టి.అంజయ్యను జనతా పార్టీ పక్షాన పోటీచేసిన నాయిని ఓడించడం ఒక విశేషం. ఎస్‌.జైపాల్‌ రెడ్డి అప్పట్లో జనతా పార్టీ టికెట్‌పై గెలిచారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఆర్‌.సురేంద్రరెడ్డిలు కాంగ్రెస్‌ ఆర్‌ నుంచి గెలిచారు. సీపీఎం నుంచి నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందారు. 

ఎస్సీల మద్దతు కాంగ్రెస్‌– ఐ కే.. 
ఎస్సీ రిజర్వుడ్‌ సీట్లలో కాంగ్రెస్‌ ఐ స్వీప్‌ చేసిందని చెప్పాలి. మొత్తం 17 సీట్లకు గాను పదిహేనింటిని కాంగ్రెస్‌ ఐ గెలచుకోగా, జనతా పార్టీ , కాంగ్రెస్‌ ఆర్‌లు ఒక్కో స్థానం మాత్రమే దక్కించుకున్నాయి. గెలిచిన ప్రముఖులలో సుమిత్రాదేవి, గోకా రామస్వామి, కాంగ్రెస్‌–ఆర్‌ నుంచి రాజనరసింహ ఉన్నారు. 

వెలమలు... 
వెలమ వర్గం నుంచి ఏడుగురు ఎన్నికైతే వారిలో నలుగురు కాంగ్రెస్‌–ఆర్‌ నుంచి కావడం విశేషం. ఆనాటి సీఎం జలగం వెంగళరావు కాంగ్రెస్‌ ఆర్‌ లోనే ఉన్నారు. అందువల్ల కొందరు ముఖ్యమైన నేతలు కూడా ఆ పార్టీలోనే ఉండి పోటీచేయవలసి వచ్చింది. జలగం వెంగళరావు సత్తుపల్లి నుంచి గెలిచి, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోవడంతో సత్తుపల్లి సీటుకు కూడా రాజీనామా చేశారు. 1978 లో గెలిచిన వెలమ ప్రముఖులలో యతిరాజారావు, చెన్నమనేని రాజేశ్వరరావు వంటి వారు ఉన్నారు. చెన్నమనేని సీపీఐ పక్షాన గెలిచారు. 

ఇతరులు.. 
ముస్లింలు ఐదుగురు గెలిస్తే వారిలో ఇద్దరు కాంగ్రెస్‌ కాగా, ముగ్గురు ఎంఐఎం సభ్యులు. హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి వారు గెలుపొందారు. మజ్లిస్‌ పక్ష నేత సలావుద్దీన్‌ ఒవైసీ కూడా వీరిలో ఉన్నారు. కమ్మ వర్గం నుంచిఐదుగురు గెలిస్తే ఇద్దరు కాంగ్రెస్‌ ఐ, ఇద్దరు జనతా, ఒకరు సీపీఎం నుంచి గెలుపొందారు. చేకూరి కాశయ్య, టి.లక్ష్మీకాంతమ్మ , అరిబండి లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. ఒక వైశ్య నేత గెలిచారు. ఆయన కరీంనగర్‌ నుంచి గెలుపొందారు. లింగాయత్‌ వర్గం నేత శివరావు షెట్కర్‌ నారాయణ ఖేడ్‌ నుంచి గెలుపొందారు. గిరిజనులకు ఏడు సీట్లు రిజర్వు అయి ఉన్నాయి. 

 అత్యధికం వారే..
ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 27 మంది విజయం సాధించడం విశేషం. వీరిలో మున్నూరు కాపు 6, గౌడ 7, ముదిరాజ్‌ 4, కురుబ 2, పద్మశాలి 1, లోద్‌ క్షత్రియ 1, యాదవ 1, పెరిక 1, మేరు 1, వడ్డెర 1, విశ్వబ్రాహ్మణ 1, ఇతరులు1 ఉన్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే బీసీలు కాంగ్రెస్‌ ఐ నుంచి 20 మంది, జనతా 4, కాంగ్రెస్‌ ఆర్‌ 1, సీపీఐ 1, సీపీఐఎమ్‌ 1 చొప్పున గెలుపొందారు. ఆనాటి కాంగ్రెస్‌ ఐ అధినేత్రి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై బలహీనవర్గాలు విశేష ఆదరణ చూపాయి. దానికి తగినట్లుగానే అత్యధికంగా 27 మంది బీసీ వర్గాల వారు గెలిచారు. ఈసారి గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్‌ వర్గాలకు అధిక వాటా దక్కింది. గెలుపొందిన ప్రముఖులలో జి.రాజారామ్, బాలా గౌడ్, మాణిక్‌ రావు, మద్దికాయల ఓంకార్‌ తదితరులు ఉన్నారు.  
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement