1994లో తెలుగుదేశం ప్రభంజనం వీచింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎంలకు కలిపి 90 సీట్లు వస్తే, టీడీపీ మద్దతు ఇచ్చిన మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. తెలంగాణలో కేవలం ఆరు సీట్లే దక్కాయి. అయితే, ఇంత భారీ మెజార్టీ సాధించుకున్న తెలుగుదేశం అధినేత ఎన్.టి.రామారావు ఈసారి ఎనిమిది నెలలకే ఆయన అల్లుడు, అప్పటి మంత్రి చంద్రబాబు చేతిలో పరాభవానికి గురై ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలవారీగా చూస్తే తెలంగాణలో రెడ్డి వర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం 35 మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ తరపున అతి తక్కువగా కేవలం నలుగురే ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి 21 మంది, బిజెపి నుంచి ఒకరు, సిపిఐ తరపున ఇద్దరు, సిపిఎం పక్షాన నలుగురు రెడ్డి నేతలు ఎమ్మెల్యేలు కాగా, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి నేతలు గెలుపొందారు. వెలమ నేతలు 12 మంది గెలుపొందగా, ఎనిమిది టీడీపీ, బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు.
ముస్లింలు ఐదుగురు గెలుపొందగా, టీడీపీ, సీపీఐ, ఎంఐఎం లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇద్దరు ఎంబీటీ పక్షం నుంచి విజయం సాధించారు. ఎంఐఎంలో చీలిక వచ్చి కొత్తగా ఏర్పడ్డ ఎంబీటీ రెండుస్థానాలు సాధించింది. కమ్మ నేతలు ఆరుగురు గెలుపొందగా, నలుగురు టీడీపీ, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. ఎస్సీ వర్గాల నుంచి 17 మంది విజయం సాధించగా, వారిలో 12 మంది తెలుగుదేశం, ఇద్దరు సీపీఐ, ఇద్దరు సీపీఎం, ఇండి పెండెంట్ ఒకరు గెలిచారు. ఎస్టీలు ఎనిమిది మందికి గాను, కాంగ్రెస్ ఒకరు, టీడీపీ మూడు, సీపీఐ మూడు, సీపీఎం ఒకురు గెలిచారు. బీసీ వర్గాలు 21 మంది గెలిస్తే, ఒకరు కాంగ్రెస్ నుంచి, 17 మంది టీడీపీ నుంచి గెలిచారు. బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇతర వర్గాలకు చెందిన ఆరుగురు టీడీపీ నుంచే గెలిచారు. వీరిలో బ్రాహ్మణులు ఇద్దరు, వైశ్య ఒకరు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఆయా వర్గాల నుంచి గెలుపొందిన ప్రముఖులలో కాంగ్రెస్ పక్షాన కె.ఆర్ సురేష్ రెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి , మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, ముద్దసాని దామోదరరెడ్డి, పి.ఇంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎ.మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
సీపీఐ నేత విఠల్ రెడ్డి మరోసారి చట్టసభకు వచ్చారు. కాంగ్రెస్ నేత ఆర్.దామోదరరెడ్డి టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా గెలిచారు. కమ్మవర్గం వారు టీడీపీ మిత్రపక్షాల నుంచే గెలిచారు. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు(టీడీపీ)పువ్వాడ నాగేశ్వరరావు(సీపీఐ), బోడేపూడి వెంకటేశ్వరరావు గెలిచినవారిలో ఉన్నారు. వెలమ నేతలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, యతిరాజారావు, (టీడీపీ) చెన్నమనేని రాజేశ్వరరావు(సీపీఐ), సీహెచ్ విద్యాసాగరరావు (బీజేపీ) ఉన్నారు. బీసీ వర్గాలలో మున్నూరు కాపు నుంచి ఐదుగురు, గౌడ ఇద్దరు, యాదవ ముగ్గురు, ముదిరాజ్ నలుగురు, పద్మశాలి 1, విశ్వబ్రాహ్మణ 1, పెరిక 1, పట్కారి 2, ఆర్య మరాఠా ఇద్దరు ఉన్నారు. బీసీ ప్రముఖులలో దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, పి.చంద్రశేఖర్, ఎల్.రమణ, ఎస్.మధుసూదనాచారి, దానం నాగేందర్ ప్రభృతులు ఉన్నారు. ఎస్సీల్లో బోడ జనార్దన్, మోత్కుపల్లి నరసింహులు, కడియం శ్రీహరి, గుండా మల్లేష్, తదితరులు ఉన్నారు. ఎస్టీల్లో గోవింద నాయక్, చందూలాల్, రెడ్యాలు ఉన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తొలిసారి ఎన్నికయ్యారు.
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు
పెరిగిన బీసీ,ఎస్సీలు
Published Thu, Nov 29 2018 3:47 AM | Last Updated on Thu, Dec 27 2018 4:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment