విలేకరులతో మాట్లాడుతున్న ఈశ్వరప్ప
సాక్షి, బళ్లారి:బెంగళూరు విధానసౌధలో ఈనెల 25 నుంచి రెండు రోజులు పాటు జరగనున్న వజ్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బంగారు బిస్కెట్ల అందజేతను విధాన పరిషత్ ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లా సండూరులోని కుమారస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధానసౌధను ఎవరో మహానుభావుడు నిర్మిస్తే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు బంగారు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం సిద్ధరామయ్య బంగారు బిస్కెట్లు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు అతివృష్టితో నానా అవస్థలు పడుతుంటే బంగారు బిస్కెట్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇందుకు అయ్యే ఖర్చును పేదల అభ్యున్నతికి, కరువు పీడిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని సూచించారు. వజ్ర మహోత్సవాల్లో పంపిణీ చేసే బంగారు బిస్కెట్లను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకోబోమన్నారు.
వజ్ర మహోత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజా«ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తూ ప్రజా సంక్షేమం విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో రైతులకు రుణ మాఫీ చేసినట్లుగానే కర్ణాటకలో కూడా ఎందుకు సంపూర్ణ రుణ మాఫీ చేయడం లేదని నిలదీశారు. తక్షణం రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారని, 150 సీట్లు దక్కించుకుని బీజేపీ విజయ పతాక ఎగర వేస్తుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment