సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని, నిర్దిష్ట కాలపరిమితితో ఆ పనులను పూర్తి చేస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్ర మంతటా పర్యటిస్తానని తెలిపారు. పార్టీపై సంపూర్ణ విశ్వాసం ఉన్నా.. అతివిశ్వాసం పనికిరాదని, ఆత్మవిశ్వాసం ఉండాలని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయొద్దని, పార్టీ శ్రేణులు కలసికట్టుగా పని చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో రెండు, మూడు సర్వేలు చేయిస్తున్నామని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కావొద్దని, భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 2020లో కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేస్తామని, భవన నిర్మాణ అనుమతులు 21 రోజుల్లో ఆన్‌లైన్‌లో అందిస్తామన్నారు. చట్టాలను ఉల్లంఘించే కౌన్సిలర్లపై అనర్హత వేటు పడుతుందని, తప్పు చేస్తే సొంత పార్టీ వారిని కూడా క్షమించకుండా తొలగిస్తామన్నారు. అవినీతి రహితంగా, పారదర్శకమైన పాలన అందిస్తామని మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంపై ఎన్నికైన కౌన్సిలర్లకు ముందే శిక్షణ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. పురపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పురపాలన అంటే ఏమిటో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం
రాష్ట్రంలో జరుగుతున్న 120 మున్సిపాలిటీలు, 3,184 వార్డులలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర మంతటికి గోదావరి జలాలను కాళేశ్వరం పథకం ద్వారా మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు. 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో దేశంలోనే తెలంగాణ సంక్షేమ పథకాల అమలులో ముందుందని వివరించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం కేసీఆర్‌పై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లోనూ 90 శాతం సర్పంచులు టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు గెలిచారని మంత్రి గుర్తు చేశారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment